గోల్డెన్ ఛాన్స్ వదిలేసుకుంటున్న పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుందని అనలేంగానీ, విపక్షాలు పుంజుకునేందుకు ఓ అవకాశమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకేసినా, జనసేన పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, సొంత పార్టీని కాదనుకున్నా.. ఇంకా రాష్ట్రంలో విపక్షాలు నిలదొక్కకునేందుకు అవకాశాలు లేకపోలేదు. అధికార పార్టీ ఎంతలా సంక్షేమ కార్యక్రమాల్ని చేపడుతున్నప్పటికీ, చాలా విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి వుంది. లేకపోతే, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఆశించిన మెజార్టీ రాకపోవడమేంటి.? స్థానిక ఎన్నికల్ని బట్టి, రాజకీయ పరిణామాల్ని అంచనా వేయలేం.. అది వేరే సంగతి. టీడీపీ సంగతి ఎలా వున్నా, జనసేన పార్టీకి ఇదొక మంచి సమయం. కాస్త ఫోకస్ సరిగ్గా పెడితే, జనసేన పార్టీ బలపడేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఆ పార్టీకి చాలా సమస్యలున్నాయి. అందులో అతి ముఖ్యమైనది అనుభవ లేమి.

పార్టీని ఎలా నడపాలన్నదానిపై జనసేన అధినేతకు స్పష్టత లేదు. సినిమాల్లో బిజీ అయిపోయి, పార్టీని గాలికొదిలేశారన్న విమర్శ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వుంది. పార్టీ శ్రేణులు, అందునా జనసైనికులు కింది స్థాయిలో కష్టపడుతున్నా, వారిని సరైన రీతిలో నడిపించే నాయకులు కనిపించడంలేదు. ఈ మధ్యనే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకూ పవన్ శ్రీకారం చుట్టారు. కానీ, ఆ నేతలు.. కింది స్థాయిలో సరిగ్గా పని చేయడంలేదన్న విమర్శలున్నాయి. కార్యకర్తలు ఎంతలా పని చేసినా, నాయకులూ తమ బలాన్ని చాటుకోవాలి. ఎందుకంటే, ప్రజలు ఓట్లెయ్యాల్సింది నాయకులకే తప్ప, కార్యకర్తలకు కాదు కదా.? ఈ విషయమై జనసేన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే, రాష్ట్రంలో జనసేన పార్టీ నిలదొక్కుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. నిజానికి, ఇది గోల్డెన్ ఛాన్స్. 2024 నాటికి జనసేన బలపడలేకపోతే, ఇక ఆ పార్టీ భవిష్యత్ అంధకారమే.