ఏపీలో మున్సిపల్ పోరు ఆసక్తిగా సాగుతుంది. జనసేన అధినేత పవన్ ను మున్సిపల్ ఎన్నికల కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు పోటా పోటీ ప్రచాలతో దూకుడుగా దూసుకెళ్తున్నాయి. పవన్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గ్రేటర్ విశాఖ ప్రచారానికి పవన్ రాలేకపోతుండడం పై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ పొత్తు మేలు చేయకపోగా పార్టీకి మరింత నష్టం చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షాన నిలిచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్ కు మద్దతు తెలిపినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంద్ విషయంలో నోరెత్తలేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేయలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ పై పవన్ నోరు మెదపకపోతే విశాఖలో నష్టం తప్పదని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు.
ఓటమి పాలైనా భాగానే ఓట్లు పోలయ్యాయి. గాజువాక తో పాటు విశాఖ వ్యాప్తంగా ఉన్న యువతలో పవన్ పై మంచి క్రేజ్ ఉంది. దీంతో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని.. బీజేపీ పొత్తు కూడా తమకు కలిసి వస్తుందని మొదట భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన గొంతు వినిపించేవారు . బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది . బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన విశాఖ ఉక్కు కార్మికులకు అండగా తన స్టాండ్ ను ప్రకటించ లేకపోతున్నారు.