రాజ్యసభకు పవన్ కళ్యాణ్.. నిజమేనా.? జనసేనకైనా తెలుసా.?

Pawan Kalyan In Rajya Sabha Race?

Pawan Kalyan In Rajya Sabha Race?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళనున్నారట. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏ క్షణాన అయినా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. రేపు తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో బీజేపీ మద్దతుదారులైన కొందరు నెటిజన్లు ఈ ప్రచారం చేస్తోంటే, చాలామంది పవన్ అభిమానులు, ఈ దుష్ప్రచారంపై మండిపడుతున్నారు. కొందరు పవన్ అభిమానులు మాత్రం, అప్పుడే తమ అభిమాన హీరోకి అభినందనలు చెప్పేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. నిజానికి, పవన్ కళ్యాణ్ గనుక రాజ్యసభకు వెళ్ళాలనుకుంటే, గతంలోనే వెళ్ళేవారు. బీజేపీ – టీడీపీలకు 2014 ఎన్నికల్లో మద్దతిచ్చినందుకుగాను పవన్ కళ్యాణ్ ని రాజ్యసభకు పంపాలని గతంలో ప్రతిపాదనలు నడిచాయి. ఓ దశలో ఆయన్ని కేంద్ర మంత్రిని చేస్తారనే వార్తలూ వినిపించాయి. అయితే, పవన్ ఏనాడూ రాజ్యసభ గురించి ఆలోచించలేదు.

నామినేటెడ్ పోస్టులపై ఆయనకు ఆసక్తి లేదు. ఆ విషయాన్ని ఈ మధ్యనే ఓ సందర్భంలో చెప్పారు కూడా. అయినాగానీ, ఈ పుకార్లు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి.? ఈ విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీజేపీ – జనసేన మధ్య విభేదాల్ని తీసుకురావడానికి వైసీపీ ఆడుతున్న గేమ్ ప్లాన్.. అని కొందరు అంటోంటే, ఇదంతా టీడీపీ కుట్ర అని మరికొందరంటున్నారు. బీజేపీ వుండగా, ఇలాంటి కుట్రలు చేసే అవకాశం ఇంకొకరికి ఇస్తారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. కేవలం తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీ – జనసేన మైత్రి గురించి పాజిటివిటీ క్రియేట్ అవడం కోసం కమలదళం వండి వడ్డించిన గాసిప్.. అనే చర్చ ఇటు మీడియా, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇంకోపక్క సోషల్ మీడియాలోనూ చాలా ఎక్కువగా నడుస్తోంది.