పట్టాభి పైత్యం: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడి.!

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో పట్టాభి విరుచుకుపడ్డంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసహనానికి గురయ్యాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్.. అంటూ ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలతో పెను రాజకీయ దుమారం చెలరేగింది.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళగిరిలో వైసీపీ శ్రేణులు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

అధికార పక్షాన్ని రెచ్చగొట్టేందుకు గత కొంతకాలంగా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలపైనా దాడులు జరుగుతున్నాయి వైసీపీ శ్రేణుల నుంచి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. దాన్ని దాడి కాదంటూ వైసీపీ సమర్థించుకుందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, తాజా వ్యవహారాన్ని మాత్రం ‘దాడి’ కాదు అని ఎవరూ అనలేని పరిస్థితి. ఎందుకంటే, అత్యంత దారుణమైన స్థాయిలో విధ్వంసం చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం ధ్వంసమైంది. పెద్దయెత్తున ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు రాష్ట్ర బంద్‌కి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందనీ, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందనీ, తాజా దాడులకు ముఖ్యమంత్రి, డీజీపీ వ్యూహరచన చేశారని చంద్రబాబు ఆరోపించడం గమనార్హం.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. టీడీపీ నేతలే రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారనీ, వారిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై వుందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటుండకూడదు. దాడులు జరిగే చోట అసలు ప్రజాస్వామ్యం వుందని అనలేం. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఈ దాడులకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అదే సమయంలో, టీడీపీ అధినేత చంద్రబాబు తమ నాయకుల నోళ్ళను అదుపులో వుంచేలా చర్యలు తీసుకోవాలి.