ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అనంతపురం జిల్లాలో ముందుకు నడిపించిన పరిటాల కుటుంబం టీడీపీకి అధికారం పోయినప్పటి నుండి రాజకీయంగా ముందుకు రావడంలో కాస్త తడబడుతున్నట్లుగా ఉందట.. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకీ వచ్చినప్పటి నుండి టీడీపీ నాయకులపై కేసుల సంఖ్య ఏపీలో ఊహించని విధంగా ఉంది.. అందులో పార్టీ నాయకుల్లో ఉత్సాహం కరువై వలసలు వెళ్లుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం కొందరిలో నిరాశ కలిగిస్తుందట.. అదీగాక ఆ రాష్ట్ర ప్రభుత్వం వినుకొండలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా పరిటాల రవీంద్ర విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే..
ఈ విషయంలో ఎలాంటి హడావుడి చేయని పరిటాల కుటుంబం తెరవెనక ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.. అదేమంటే పరిటాల శ్రీరామ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి భారీగా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాడట. అంతే కాకుండా ఈ పాదయాత్ర వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలనే ప్రణాళికలో ఉన్నారట.. ఈ క్రమంలో పార్టీని తనవైపు తిప్పుకొనేందుకు, ముఖ్యంగా యువతను తనవైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాప్తాడు నుంచి పెనుకొండ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న శ్రీరాం దాదాపు నెల రోజులుగా ఆయన ఈ ప్లాన్‌లో ఉన్నారట.. దీనికి సంబంధించిన విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు అందించారని పరిటాల వర్గం చెబుతోంది. అయితే రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో పరిటాల రవి, ఎన్టీఆర్ విగ్రహాలను అధికారులు తొలిగించామని చెబుతున్నా, వైసీపీ నేతల దూకుడు కారణంగానే అధికారులు ఇలా నిర్ణయం తీసుకున్నారని పరిటాల వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలో విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయించడంతోపాటు.. పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పాదయాత్ర అయితే బెటర్ అని శ్రీరాం భావిస్తున్నారట. ఇందుకుగాను అనుమతి ఇవ్వాలని చంద్రబాబును కోరగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదట.. దీంతో శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. కాగా ఇప్పుడు పరిటాల శ్రీరాంకు అనుమతి ఇవ్వడం మంచిదే అయినా.. మరోపక్క, జేసీ వర్గం కూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉందని, తమను కేసుల్లో ఇరికిస్తే.. చంద్రబాబు అనుకున్న విధంగా స్పందించలేదని, ఈ సమయంలో ఒక వర్గానికి చంద్రబాబు అనుమతి ఇస్తే.. గ్రూపులు పెరిగి.. అసలు పార్టీకే ఎసరు వస్తుందని భావిస్తున్నారనే మరో మాట కూడా పార్టీలో వినిపిస్తోంది.. మరి ఈ విషయంలో రాజుకుంటున్న నిప్పు ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు.