ఓటుకు నోటు ఇవ్వకపోతే, ఓటేసేదే లేదంటూ ఓ ఓటరు పోలింగ్ బూత్ వద్దనే రాజకీయ పార్టీలకు చెందిన నేతల్ని నిలదీసి, అట్నుంచి తాను ఆశించిన నోట్లు రాకపోయేసరికి ఓటెయ్యకూడా వెళ్ళిపోయాడు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికరమైన ఘటన ఇది. ఎన్నికలంటే ఓట్ల పండగ మాత్రమే కాదు, కరెన్సీ నోట్ల పండగ కూడా.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఎక్కడికక్కడ కరెన్సీ నోట్లు విపరీతంగా చేతులు మారుతున్నాయి. మద్యం బాటిళ్ళు.. బహుమతులు.. వారెవ్వా ప్రజాస్వామ్యం అత్యద్భుతంగా వర్ధిల్లుతోంది. ఓ చోట, జనసేన పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు కాస్తా, వైసీపీకి చెందిన ఎన్నికల గుర్తుతో కలిసిపోయింది. దాంతో పోలింగ్ నిలిపేశారు. మరో చోట, నామినేషన్ వెనక్కి తీసుకున్న అభ్యర్థి పేరు మాత్రమే బ్యాలెట్ పేపరులో కన్పించింది, అదే స్థానంలో వుండాల్సిన అధికార పార్టీ నేత పేరు లేకుండా పోయింది. ఇలా చాలా వింతలు, విడ్డూరాలు పరిషత్ ఎన్నికల సందర్భంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి చిన్నా చితకా ఘటనలు నమోదయ్యాయనీ, మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు అంటున్నారు.
ఎన్నికల్ని టీడీపీ బహిష్కరించిన దరిమిలా, కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కాగా, కొందరు అభ్యర్థులు మాత్రం, అధిష్టానం బహిష్కరిస్తే తమకేంటంటూ టీడీపీ తరఫున తమవంతుగా కష్టపడుతున్న వైనం కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ – వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఆయా ప్రాంతాల్లో కనిపిస్తోంది. జనసేన, బీజేపీ కూడా తామేం తక్కువ తిన్లేదంటూ అధికార పార్టీతో అమీ తుమీకి సిద్ధమవడంతో చిన్నా చితకా అవాంఛనీయ ఘటనలు పలు చోట్ల నమోదవుతున్నాయి. ఆగిపోతాయనుకున్న పరిషత్ ఎన్నికలకు నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తక్కువ సమయంలోనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడాల్సి వచ్చింది.