రాజీనామాలు చేస్తాం, మీరూ చేయండి ఎన్నికలకు వెళదాం అంటూ ముందస్తు ఎన్నికల కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెగ ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆశిస్తున్నట్టు ముందస్తు ఎనికలైతే రావు కానీ ఒక చోట ఉపఎన్నికలు జరగాల్సిన పరుస్థితి వచ్చింది. అదే తిరుపతి లోక్ సభ స్థానం. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లిదర్గాప్రసాద్ కొన్ని రోజుల కిందట మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడ ఉపఎన్నికల మీద దృష్టిపెట్టారు. కానీ అయనకు ఎన్నికల్లో నిలపగల గట్టి అభ్యర్థి ఎవరూ కనిపించడంలేదట.
అందుకే పాత అభ్యర్థి పనబాక లక్ష్మిగారినే బరిలోకి దింపాలని డిసైడ్ చేసుకుని వెంటనే ఆమెకు ఫోన్ చేశారట. మామూలుగా అయితే ఇలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ పనబాక లక్ష్మి మాత్రం నావల్ల కాదంటూ చేతులెత్తేశారట. కారణం ఓటమి భయం. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేసింది ఆమే. కానీ వైసీపీ అభ్యర్థి చేతిలో 2 లక్షల 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఒడిపోయారు. ఆ ఓటమితో బాగా డీలాపడిన ఆమె ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా కనబడలేదు. అధికారంలో ఉండగా ఎన్నికలు జరిగితేనే గెలవలేకపోయాం, ఇప్పుడు దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుని పోటీకి దిగితే మళ్లీ ఓడిపోతాం అనే అభిప్రాయంతో ఉన్నారట ఆమె.
పైగా జగన్ హవా గతం కంటే ఇప్పుడు బాగా పెరిగింది. చిత్తూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గతం కంటే వైసీపీ ఆ లోక్ సభ స్థానంలో చాలా బలంగా ఉంది. ఉపఎన్నికలో ప్రత్యర్థుల్ని ఓదించడానికి ఈసారి వైసీపీ తరపున చాలా శక్తులే పనిచేస్తాయి. కాబట్టి అక్కడ నిలిచి నెగ్గడం అసాధ్యమని పనబాక అంచనా అట. అంతేగాక జగన్ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుండే ఎవరికైనా ఉపఎన్నిక టికెట్ ఇస్తే గెలుపు ఏకపక్షమేనని, జనం సానుభూతితో వైసీపీకే ఓట్లు వేస్తారని, మరణించిన ఎంపీ కుటుంబానికే ఆ స్థానాన్ని వదలకుండా ఇలా పోటీకి దిగుతారా అంటూ రివర్స్ క్లాస్ పీకుతారని, కాబట్టి ఈ ఉపఎనికల గొడవ తనకు వద్దని పనబాక లక్ష్మి చంద్రబాబుకు తెగేసి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.