నిర్మాతల మీద ప్రతీకారం తీర్చుకుంటున్న ఓటీటీలు

OTT's taking revenge on producers

OTT's taking revenge on producers

గతేడాది లాక్ డౌన్ సమయంలో పలు తెలుగు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ సంస్థలు కూడ తెలుగు చిత్రాలను కొనడానికి చాలా ఆసక్తి చూపించాయి. అనుష్క ‘ నిశ్శబ్దం’, నాని ‘వి’ చిత్రాలను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలుచేసింది. తీరాచూస్తే సినిమాలు ఫ్లాప్. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ భారీ నష్టాలని చూడాల్సి వచ్చింది. ఆ చిత్రాల్ని చూశాక వీటిని కొనుగోలు చేసి ఉంటే తలకిందులయ్యే వాళ్లమని డిస్ట్రిబ్యూటర్లు అనుకున్నారు. ఆ రెండు సినిమాలు నేర్పిన పాఠం ద్వారా ఓటీటీలు సినిమాల కొనుగోలు విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టాయి.

అంతేకాదు.. థియేటర్లు ఓపెన్ అయ్యాక కొత్త సినిమాలేవీ ఓటీటీలను సంప్రదించలేదు. పైపెచ్చు థియేటర్లలో వచ్చిన ఒకటిన్నర నెల తర్వాతనే ఓటీటీలో ప్రసారం కావాలని నిబంధన పెట్టాయి. దీంతో ఓటీటీలకు, నిర్మాతలకు సైలెంట్ వార్ మొదలైంది. అదును కోసం చూస్తున్న ఓటీటీలకు కరోనా సెకండ్ వేవ్ కలిసొచ్చింది. సినిమా హాళ్ళన్నీ మూతబడటంతో అన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయో నిర్మాతలకు కూడ తెలియట్లేదు. అప్పులు తెచ్చి సినిమా మీద పెట్టిన నిర్మాతలు వడ్డీల బాధ భరించలేక ఓటీటీలకు అమ్మేయాలని చూస్తున్నారు.

కానీ ఓటీటీలు మాత్రం మునుపటిలా సౌమ్యంగా లేవు. నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళే ధరను నిర్ణయిస్తున్నారట. తాజాగా రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీల వద్దకు వెళ్లగా లాభాల సంగతి అటుంచితే కనీసం పెట్టిన డబ్బు కూడ ఇవ్వడానికి ఒప్పుకోలేదట. మొత్తానికి ఓటీటీలు గత అనుభవాలను గుర్తుతెచ్చుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టే ఉన్నాయి.