OTT Welcoming : సినిమాకి ఇదెక్కడి ఖర్మ.? ఓటీటీ ఊరిస్తోంటే, ఒమిక్రాన్ భయపెడుతోంది. ఇలాగైతే ఎలా.? నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. థియేటర్ల నిర్వహణ కష్ట సాధ్యంగా మారిపోతోంది. మొత్తంగా చెప్పాలంటే, సినిమా పరిశ్రమ పూర్తి అయోమయంలో పడిపోయింది.
కరోనా పాండమిక్ సమయంలో తెలుగు సినిమాని కాస్తో కూస్తో ఆదుకున్నది ఓటీటీ మాత్రమే. ఓటీటీ వేదికగా చాలా సినిమాలు కరోనా పాండమిక్ సమయంలో విడుదలైన విషయం విదితమే. ఆ రకంగా నిర్మాతలు కొంత ఊరట పొందారు. అయితే, పూర్తిగా ఓటీటీకే సినిమాలు పరితమైతే ఎలా.?
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి విడుదలవ్వాల్సింది.. కానీ, ఒమిక్రాన్ భయాలతో వెనక్కి వెళ్ళింది. పెద్ద సినిమాల స్థానంలో సంక్రాంతికి చిన్న సినిమాలు క్యూ కట్టేశాయి. ఇంకోపక్క, ఓటీటీ సంస్థల నుంచి ఆయా పెద్ద సినిమాలకు బోల్డన్ని ఆఫర్లు వస్తున్నాయట. వాటిల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘రాధేశ్యామ్’ సహా పలు సినిమాలున్నాయి.
‘ఫిబ్రవరి నాటికిగానీ, మార్చి నాటికిగానీ పరిస్థితులు మెరుగయ్యే అవకాశాల్లేవంటూ జరుగుతున్న ప్రచారంతో, ‘ఆచార్య’ సహా చాలా సినిమాలు ఓటీటీ వైపు కొంత ఆశగా చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ, ‘లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండడం కాస్త ఊరటగా కనిపిస్తోంది తెలుగు సినీ పరిశ్రమకి.
అదే సమయంలో, ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను మూసేస్తుండడం, ఆంక్షలు విధిస్తుండడంతో.. మళ్ళీ టెన్షన్ మొదటికి వచ్చేస్తోంది. ఓటీటీ ఆఫర్లు వదులుకుంటే, విడుదల వాయిదా పడ్డం వల్ల తలెత్తే ఆర్థిక నష్టం. థియేటర్లు తెరచుకున్నా సినిమా ఆడకపోతే వచ్చే నష్టాల గురించి బెంగపడుతున్న నిర్మాతలు, ఓటీటీ డీల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.