‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో రిలీజవుతోంటే, ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్ రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? సరే, ఈ విషయంలో తెరవెనుకాల ఏం జరిగింది.? అన్నది వేరే చర్చ. అసలు ఓటీటీ రిలీజ్ కారణంగా ముందు ముందు థియేటర్ల భవిష్యత్తు ఏమవబోతోంది.? సినిమా ఎక్స్‌పీరియన్స్.. అంటే, థియేటర్‌కి వెళ్ళాల్సిందేనన్నది ఒకప్పటి మాట. సూపర్ స్టార్ మహేష్‌బాబు తన ఇంట్లోనే కూర్చుని హాయిగా, ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చూసేశారు. పెద్ద పెద్దోళ్ళకి ఇంట్లోనే ‘హోం థియేటర్’ వుంటోంది గనుక, శాటిలైట్ లింక్ ద్వారా నేరుగా సినిమాలు చూసేయడానికి అవకాశం వుండొచ్చుగాక. కానీ, అది అందరికీ కుదురుతుందా.? ఏమో, భవిష్యత్తు అలా కూడా చేస్తుందేమో.
కరోనా పాండమిక్ పుణ్యమా అని, అవకాశం వున్న చాలామంది తమ తమ ఇళ్ళల్లోని ఓ గదిని ప్రత్యేకంగా మార్చుకునేందుకు మొగ్గు చూపారు. అచ్చం థియేటర్లను తలపించేసేలా మార్చేశారు. కాకపోతే, ఇవి మినీ థియేటర్లు.. హోం థియేటర్లు. ఓ పది మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వీటి కోసం బాగానే ఖర్చు చేశారు కూడా. కొత్తగా కడుతున్న ఇళ్ళకు అయితే, హోం థియేటర్ తరహాలో డెకరేషన్ అడుగుతున్నారట వినియోగదారులు. ఇదీ పరిస్థితి. థియేటర్ అనుభవం ఇంట్లోనే దొరికితే, థియేటర్లకు మాత్రం ఎవరు వెళతారు.? ఇంకోపక్క, థియేటర్లలో బొమ్మ పడితే.. వసూళ్ళు వస్తాయో రావో తెలియని పరిస్థితి. దాంతో, నిర్మాతలకు ఇంకో ఆప్షన్ వుండటంలేదు. అందుకే, వారు ఓటీటీ వైపు మొగ్గు చూపక తప్పడంలేదు. ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడెలా మారిపోతుందో చెప్పలేం. అందుబాటులో ఓటీటీ వున్నప్పుడు, థియేటర్ గురించి ఎందుకు ఆలోచిస్తారు.? మరి, అలాగే జనం ఆలోచిస్తే, థియేటర్లు ఏమైపోవాలి.? ఏమో, కాలం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.