కొడాలి నానికి పవన్ కళ్యాణ్ తప్ప వేరే పనేమీ లేదా.?

pawan kalyan

ఒకటే విమర్శ వందసార్లు చేస్తే, అది నిజమైపోతుందనే భ్రమల్లో వుంటే ఎలా.? మంత్రిగా మూడేళ్ళు పనిచేసిన కాలంలో, జనాన్ని ఉద్ధరించే కార్యక్రమాలేమైనా నడిపారా.? లేదా.? ‘నియోజకవర్గంలో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించకపోతే, ఎమ్మెల్యేలను జనం నిలదీస్తారు..’ అంటూ నిస్సిగ్గుగా మీడియా ముందు చెప్పిన ఘనుడు మాజీ మంత్రి కొడాలి నాని.

కోడి పందాల కోసం జనం నిలదీస్తారా.? నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి గురించి, ఇతర సమస్యల గురించీ ఎమ్మెల్యేలను జనం నిలదీస్తారా.? అది కూడా తెలియని కొడాలి నాని మంత్రి ఎలా అయ్యారబ్బా.? అని గుడివాడ ప్రజానీకమే తమను తాము ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

సరే, గుడివాడలో అపజయమే లేకుండా కొడాలి నాని రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, తనను పదే పదే ప్రజలు గెలుస్తున్నారు కాబట్టి, తాను మాట్లాడే బూతుల్నే రాజభాషగా చేయాలనే ప్రయత్నంలో ఆయన వుంటే ఎలా.?

చంద్రబాబు పాలనలో తప్పిదాలు జరిగాయి గనుకనే, ఆనాటి ఆ పాలనని భరించలేక, వైసీపీకి రికార్డు మెజార్టీని ప్రజలు అప్పగించారు. ఇప్పుడు వైసీపీ మాట్లాడాల్సింది చంద్రబాబు గురించో, పవన్ కళ్యాణ్ గురించో కాదు, ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి. రాజధాని కావాలి.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి.

కానీ, ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన కొడాలి నాని, ఇంకా తన పాత డ్యూటీ.. అదే, పవన్ కళ్యాణ్‌ని తిట్టడం, చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకోవడం శోచనీయం.