కరోనా వైరస్ సోకితే ఎంతమంది చనిపోతారు.? అన్నదానిపై చాలా అంచనాలు, అద్యయనాలు, లెక్కలు వున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల లెక్క తీస్తే, అటూ ఇటూగా ఒక్క శాతం మాత్రమే కరోనా మరణాలు కనిపిస్తున్నాయి. నిజానికి, ఇది చాలా చిన్న విషయం. ఇతర చాలా అనారోగ్య సమస్యలతో పోల్చితే, మరణాల పరంగా కరోనా మరీ అంత భయపెట్టేది కాదు. కానీ, ఇక్కడ అసలు సమస్య వేరే వుంది. అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఎక్కువ రోజులు కరోనా సోకిన వ్యక్తి ‘ఐసోలేషన్’లో వుండాలి.. లేదా, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండాలి. ఇదే అసలు సమస్య. దాంతో, మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
కరోనా కంటే ఎక్కువగా ఈ మానసిక సమస్యలే కరోనా బాధితుడి ప్రాణాలు తీసేస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి ఆగకపోతే, దేశంలో 138 కోట్ల మంది జనాభా కారణంగా.. అందులోని ఒక శాతం.. అంటే, ఒక కోటి ముప్ఫయ్ ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుంది. గతంలో పరిస్థితి వేరు. కరోనా బాగానే కట్టడి అయ్యింది. రెండో వేవ్ పరిస్థితి అలా కాదు. తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన ఇంటింటి సర్వేలోనూ, అనూహ్యమైన రీతిలో కరోనా లక్షణాలున్నవారి సంఖ్య వెలుగు చూసింది. అయితే, అందరికీ కరోనా వుందని చెప్పలేం. కానీ, ఎక్కువమందికి కరోనా సోకే అవకాశాలైతే వున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్కుని కొద్ది రోజుల క్రితం దాటేసినా, దేశంలో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడం ఊరటనిచ్చే అంశమే. అయినాగానీ, రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షల పైనే వుందంటే.. ముప్పు ఇంకా తొలగిపోలేదన్నమాట. ఒక్క శాతమే మరణాలు.. 99 శాతం సేఫ్.. అనే గణాంకాలతో పండగ చేసుకుంటే, లెక్కల్లోకి రాని మరణాలు.. ఖచ్చితంగా మరింత భయపెడ్తాయ్.