ప్రకృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పగబట్టేసినట్లే కనిపిస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన.. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్రానికి ప్రకృతి కూడా సహకరించడంలేదు. ‘మా పాలనలో దేవుడి దయవల్ల వర్షాలు దండిగా కురుస్తున్నాయి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారుగానీ, ఆ వర్షాల వల్ల రాష్ట్రానికి లాభం వుండటంలేదు సరికదా, నష్టమే మిగులుతోంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారమే తాజాగా కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆ కారణంగా వచ్చిన వరదల వల్ల ఆరు వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. పోనీ, అక్కడితో ఈ దారుణం ఆగిందా.? అంటే, లేదు.. కొనసాగుతూనే వుంది. ఆ తర్వాత కూడా మరోమారు పై జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.. అపారమైన నష్టం ఇంకోసారి వాటిల్లింది.
ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద పిడుగు పడబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా సహా ఉత్తరాంధ్ర మొత్తం భారీ వర్షాలు కురియనున్నాయి. స్కూళ్ళకు సెలవులు ప్రకటించడం, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం, ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలించడం.. ఇదంతా ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటి వ్యవహారమే.
ఎలా.? ఎన్నాళ్ళిలా.? గోరు చుట్టు మీద రోకలి పోటు తరహాలో.. అస్సలు ఊపిరి సలపనివ్వకుండా ఒకదాని మీద ఇంకోటి ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి సమస్యలు. రాష్ట్రానికి వర్ష సూచన.. అనగానే భయం తప్ప ఆనందం కనిపించడంలేదు ఎవరిలోనూ.
‘వర్షపు పీడ రాష్ట్రాన్ని ఎప్పుడు వదులుతుందో..’ అనే ఆవేదన ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ కనిపిస్తోందిప్పుడు. అంతలా వరుణుడు రాష్ట్రం మీద పగబట్టేయడం శోచనీయం.