Omicron : కోవిడ్ 19 డెల్టా వేరియంట్ వచ్చింది.. కానీ, వెళ్ళిపోయిందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని చుట్టేసింది. రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.. వాటిల్లో మెజార్టీ ఒమిక్రాన్ వేరియంట్‌కి సంబంధించినవే కావడం గమనార్హం.
భారతదేశంలోనూ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. అయితే, మార్చి నెలలో రికార్డు స్థాయికి చేరుకుని, ఆ వెంటనే పతనమైపోతుందంటూ కొన్ని అంచనాలు, అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో నిజమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలు సహజమే.
డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసం అందరికీ గుర్తుండే వుంటుంది. అంత తేలిగ్గా మర్చిపోయే దారుణం కాదది. మరి, ఒమిక్రాన్ ఏం చేయబోతోంది.? అంటే, ఇప్పటికే చాలా చేసేసింది.. కానీ, వాస్తవ పరిస్థితులైతే బయటకు రావడంలేదు. సో, ఒమిక్రాన్ విషయంలో ‘తేలిక పాటి’ వ్యాఖ్యలు, అధ్యయనాలు, విశ్లేషణల్నినమ్మలేం.
వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ సోకుతోంది.. ఓ సారి కోవిడ్ సోకినవారికీ మళ్ళీ మళ్ళీ సోకుతోంది. దీనర్థమేంటి.? ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే వున్నాయి. పాండమిక్ నుంచి ఎండెమిక్ స్థాయికి పడిపోతుందనీ, కోవిడ్ కూడా సాధారణ జలుబులాగా మారిపోవచ్చనీ వైద్య నిపుణులు చెప్పడం చూశాం.
నిజానికి, కోవిడ్ వైరస్ మీద పై చేయి సాధించేందుకు అవసరమైన మెడిసిన్స్ ఇంతవరకు తయారవలేదంటే.. మన పరిశోధనలు ఎంత గొప్పగా సాగుతున్నాయో.. ఆ పరిశోధనల్ని నమ్మి అధ్యయనాలు ఎలా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒమైక్రాన్ వెళ్ళిపోయినా, ఇంకోటేదో వచ్చే అవకాశాలైతే వుంటాయ్. జాగ్రత్తగా వుండాల్సిందే, తప్పదు.!