Omicron : ఒమిక్రాన్: ఆ దుష్ప్రచారంతో ప్రజల్ని నిండా ముంచేశారు.!

Omicron : అబ్బే, ఒమిక్రాన్ పెద్దగా ఆందోళనకరం కాదు. సాధారణ జలుబు లాంటిది మాత్రమే.! ఒమిక్రాన్ విషయంలో జరిగిన ‘తేలిక’ ప్రచారం అంతా ఇంతా కాదు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూశాక చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. కానీ, మన దేశంలో సరైన అప్రమత్తత కనిపించలేదు.

‘అదసలు పెద్దగా ఇబ్బంది పెట్టే వేరియంట్ కాదు.. ఆసుపత్రి పాలయ్యే అవకాశం చాలా తక్కువట..’ అంటూ ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చెప్పిన మాటలతో జనంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఈ రోజుకీ జనంలో భయం లేకుండా పోయిందంటే కారణం, ఆ తేలికపాటి ప్రచారమే.

ఫలితం, నేడు లక్ష దాటిన కోవిడ్ 19 కేసులు. వీటిల్లో ఎన్ని ఒమిక్రాన్ వల్ల నమోదైన కేసులు.?అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఒమిక్రాన్ విషయమై ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకీ, వాస్తవ లెక్కలకీ పొంతన లేదు. మెజార్టీ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే.. అంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చేయడం గమనార్హం.

పైగా, ఒమిక్రాన్ వల్ల ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వాస్తవానికి సెకెండ్ వేవ్ మొదట్లో కూడా ఇదే నిర్లక్ష్యం. ఇప్పుడు మూడో వేవ్ విషయంలో అంతకు మించిన నిర్లక్ష్యం కనిపిస్తోంది. పండగలకు ఇబ్బందుల్లేవ్.. విలాసాలకు అలసలే ఆంక్షల్లేవ్.. అంతిమంగా ఒమిక్రాన్‌ రాకకి స్వాగతం పలుకుతూ తలుపులు బార్లా తెరిచేశాం.

జస్ట్ నాలుగైదు రోజుల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ జోరు కొనసాగితే, సెకెండ్ వేవ్ రికార్డుని దాటేయడానికి ఈ వారం రోజులు చాలా చాలా ఎక్కువేమో. అదే జరిగితే, దేశం తట్టుకునే పరిస్థితి వుంటుందా.?