Omicron Tensions : ఒమిక్రాన్ భయాలు.. లాక్ డౌన్ తప్పేలా లేదే.!

Omicron Tensions :  దేశంలో ఒమిక్రాన్ సైరన్ గట్టిగానే మోగేలా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా నమోదవుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. క్రిస్‌మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో ఈ ఆంక్షలు తప్పనిసరి అయ్యేలా వుంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో ఇప్పటికే 30కి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంకా సింగిల్ డిజిట్‌లోనే వుండడం కాస్త ఊరట. అయితే, చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరించేసిందా.? అన్న అనుమానం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
రాత్రి కర్ఫ్యూలు తప్పవా.? మొత్తంగా లాక్ డౌన్ వుంటుందా.? కేవలం చిన్నపాటి ఆంక్షలతో సరిపెడతారా.? ఇలా జనంలో బోల్డన్ని అనుమానాలు. వ్యాక్సినేషన్ తెలుగు రాష్ట్రాల్లో బాగానే జరగడంతో, పెద్దగా ఆంక్షలు వుండకపోవచ్చన్న అభిప్రాయాలూ లేకపోలేదు.

అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నవారికీ ఒమిక్రాన్ సోకుతుండడంతో, ఆంక్షలు తప్పకపోవచ్చు. అయితే, ఆ పరిస్థితి రాదనీ, ప్రధానంగా విదేశాల నుంచి వచ్చినవారిలోనే ఇప్పటిదాకా ఒమిక్రాన్ గుర్తించిన దరిమిలా, ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదనీ, విదేశాల నుంచి వచ్చేవారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ చెబుతున్నాయి.

దేశంలోని మిగతా రాష్ట్రాల పరిస్థితీ ఇంతే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో క్రిస్‌మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు షురూ అయిన దరిమిలా, ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.