Omicron : పల్లెకు పయనమైన ఒమిక్రాన్.. తీవ్రత ఏ స్థాయిలో వుంటుందో.!

Omicron : సంక్రాంతి పండక్కి ఊరెళుతున్నారా.? పండగ సంబరాలు చేసుకుంటారు సరే, ఒమిక్రాన్ మాటేమిటి.? ‘టీవీల్లో వచ్చే వార్తల్లో తప్ప, బయట ఎక్కడా ఒమిక్రాన్ లేదు.. కనిపించడంలేదు.. అసలు కరోనా వైరస్ భయాలే లేవు.. ఎవరికీ బాధ్యతా లేదు..’ అంటున్నారు సంక్రాంతి పండక్కి పట్టణాల నుంచి పల్లెబాట పడుతున్న జనం.

రైల్వే స్టేషన్లలో రద్దీ.. బస్టాండ్లలో రద్దీ.. ఇవికాక ప్రైవేటు వాహనాల్లో వెళ్ళేవాళ్ళ సంగతి సరే సరి. ప్రతియేటా సంక్రాంతి పండక్కి పట్టణం, పల్లెబాట పట్టడం మామూలే. ఈసారీ అదే జరుగుతోంది. పనిలో పనిగా తమతోపాటు ఒమిక్రాన్ వైరస్‌ని కూడా జనం పల్లెకు తీసుకెళుతున్నారన్న భావన లేకపోలేదు.

జనం ఎక్కడికక్కడ ఆగిపోతే కోవిడ్ వ్యాప్తి జరగదా.? అంటే, మొదటి వేవ్ సమయంలో పెట్టిన లాక్ డౌన్ తదనంతర పరిణామాల్నే గుర్తు తెచ్చుకోవాలి. లాక్ డౌన్ వల్ల కోవిడ్ వ్యాప్తి ఆగదు.. అయినా, ఎన్నాళ్ళని లాక్ డౌన్‌లో వుండగలం.? ఆంక్షలైనా అంతే.

కోవిడ్ పాండమిక్ నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక రోజున కోవిడ్ బారిన పడాల్సిందే. వ్యాక్సినేషన్ వల్ల కొంత ఉపశమనం కలగవచ్చుగాక. కానీ, అదే శ్రీరామరక్ష అనుకుంటే పొరపాటే. కోవిడ్ వైరస్ సోకినవారికి చికిత్స కోసం మందులు అందుబాటులోకి రావాలి.

రెండేళ్ళుగా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి తప్ప, కోవిడ్ చికిత్సకు ఖచ్చితమైన మందులంటూ కనుగొనలేకపోవడం శోచనీయం. వ్యాక్సిన్లు మాత్రం కుప్పలు తెప్పలుగా అందుబాటులో వున్నాయి. వ్యాక్సిన్లు పొడిచేస్తున్నారు, ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకుంటున్నారు, వైరస్ తన పని తాను చేసుకుపోతోంది.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే వున్నాయి.

సో, పండగ వేళ ఒమిక్రాన్ కావొచ్చు.. కోవిడ్ పాత వేరియంట్ డెల్టా కావొచ్చు.. ఈ భయాల సంగతెలా వున్నా, సంబరాలు మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు జనం. భయపడుతూ బతకలేం.. కానీ, బాధ్యత కూడా ఖచ్చితంగా వుండాల్సిందే.