Omicron: ఇండియాలో 126కి చేరిన ఓమిక్రాన్ కేసులు… ఏయే రాష్ట్రాలలో ఎన్నంటే?

Omicron new cases in india

Omicron: దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్‌ (ఓమిక్రాన్) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శనివారం నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో ఓమిక్రాన్ కోవిడ్ కేసుల సంఖ్య 126 కి పెరిగింది. ఈ వేగం చూస్తుంటే మరో ముప్పు రాబోతుందని అర్ధమవుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర అధికార జాబితా ప్రకారం కొత్తగా కర్ణాటకలో ఆరు, కేరళలో నాలుగు, మహారాష్ట్రలో ముగ్గురు వ్యక్తులకు ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్ర (43), ఢిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (8), గుజరాత్ (7), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) మరియు పశ్చిమ బెంగాల్ (1)లో ఓమిక్రాన్ కేసులు కనుగొనబడ్డాయి.

ఇప్పటివరకు ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్ 89 దేశాలలో కనుగొనబడిందని, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న ప్రాంతాల్లో 2 నుండి 3 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, అయితే ఇది రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం వల్లనా లేక ట్రాన్స్మిసిబిలిటీ లేదా రెండింటి కలయిక వల్ల జరిగిందా అనేది స్పష్టమవ్వలేదని WHO పేర్కొంది.

ఇక, భారతదేశంలో నిన్న ఒక రోజు 7,081 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,40,275 కు పెరిగింది. ప్రస్తుతానికి 83,913 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరణించిన 264తో మరణాల సంఖ్య 4,77,422కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం అనవసర ప్రయాణాలు, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను తక్కువ మందితో జరుపుకోవాలని ప్రజలను కోరింది. కరోనా మూడవ వేవ్ ముప్పును ఎదుర్కొనటానికి ఫేస్ మాస్క్‌ల వాడకం, సామాజిక దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని కేంద్రం హెచ్చరిస్తుంది.