Omicron : ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దంటున్న సినీ సెలబ్రిటీలు.!

Omicron : మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. అంతకు ముందు మహేష్ బాబు కూడా కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు. తన సోదరుడు హఠాన్మరణం చెందితే అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు మహేష్.. హోం ఐసోలేషన్ కారణంగా. నిజానికి, ఇది చాలా చాలా కష్టమైన సందర్భం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు మరీ అంత కఠినంగా అమలు కావడంలేదు. నిజానికి, నిబంధనలు అసలు అమలు కావడంలేదనడం కరెక్టేమో. అందుకే, దేశంలో విపరీతంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. చాలా కేసులు అధికారికంగా నమోదు కావడంలేదు కూడా.

వస్తోంది.. తగ్గిపోతోంది.. అన్న భావన చాలామందిలో వుంది. కానీ, మహేష్ చాలా రోజులు ఐసోలేషన్‌లో వుండాల్సి వచ్చింది. చిరంజీవి కూడా క్వారంటైన్‌లోనే వున్నారు. ఓ సినీ గాయని అయితే, కోవిడ్ లక్షణాలు తీవ్రంగానే వున్నాయంటూ తాను పడుతున్న ఇబ్బందుల గురించి సుదీర్ఘంగా సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం.

కోవిడ్ బాధితుల చికిత్స నిమిత్తం ప్లాస్మా డిమాండ్లూ పెరుగుతున్నాయి. కోవిడ్ చికిత్సలో వాడే కొన్ని ఔషధాలు బ్లాక్ మార్కెట్లో అదనపు రేట్లకు అమ్ముడవుతున్నాయి. ఆక్సిజన్ సమస్య పెద్దగా వున్నట్లు కనిపించడంలేదు. అదొక్కటే కాస్త ఊరట.

ఇదిలా వుంటే, దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నట్లు కేంద్రం చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కేసుల పరంగా చాలా ముందంజలో వుంది. తెలంగాణలో పరిస్థితి బెటర్‌గానే వుంది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెట్లు ఎక్కువగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.