ఒమిక్రాన్ కోవిడ్ 19: ప్రపంచానికి మరో పెను ఉత్సాతమిది.!

కోవిడ్ 19 దెబ్బకి ప్రపంచం విలవిల్లాడింది.. కాదు కాదు, విలవిల్లాడుతూనే వుంది. మొదటి వేవ్ తర్వాత, ‘ఏం భయం లేదు.. ఆల్ ఈజ్ వెల్..’ అనుకున్నారు.. అంతలోనే సెకెండ్ వేవ్ వచ్చేసింది. సెకెండ్ వేవ్ మరింతగా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు మూడో వేవ్ ప్రకంపనల్ని చూస్తున్నాం.

ఏ వైరస్ అయినా, దానికి సంబంధించి పలు మ్యుటేషన్లు తెరపైకొస్తుంటాయి. పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు జరిగినా, వాటిల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరంగా మారుతుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చిత్రమేంటంటే, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల అంచనాల్ని తల్లకిందులు చేస్తూ, కోవిడ్ 19 ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తోంది.

యావత్ మానవాళికే ఈ కోవిడ్ 19 ముప్పుగా మారుతోంది. కోవిడ్ వస్తుంది.. పోతుంది.. అనుకోవడానికి వీల్లేదు. కోవిడ్ 19 దెబ్బకి ప్రాణ నష్టంతోపాటు, ఆర్థిక విధ్వంసం చోటు చేసుకుంటోంది. అదే అతి పెద్ద సమస్య. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ 19 దెబ్బకి అతలాకుతలమవుతూనే వున్నాయి.

ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎప్పటికప్పుడు పతనమైపోతుండడంతో.. భవిష్యత్ అందరికీ భయానకంగానే కనిపిస్తోంది. ‘ఆల్ ఈజ్ వెల్.. వ్యాక్సిన్లు వచ్చేశాయ్..’ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే, వ్యాక్సిన్లు తీసుకున్నవారికీ కరోనా వైరస్ సోకుతూనే వుంది.

ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి.? మీడియా ఏం చెబుతోంది.? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇలా చెప్పుకుంటూ పోతే.. అందరూ ఏవేవో చెబుతున్నారు.. కానీ, ఎక్కడా స్పష్టత లేదు. మొదటి వేవ్ నుంచి పాఠం నేర్చుకుంటే రెండో వేవ్ వచ్చేది కాదు. రెండో వేవ్ నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదు కాబట్టే, మూడో వేవ్ వస్తోంది.