Crime News: ప్రస్తుత కాలంలో చిట్టీల పేరుతో మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతుండటం తెలిసినా కూడా చాలామంది ప్రజలు చిట్టీల పేరుతో కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరి చేతిలోనూ పెట్టి మోసపోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.దాదాపు 20 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా ఉండి అందరిలో కలిసిపోయి ఉన్న వ్యక్తి 25 కోట్ల రూపాయలు కాజేసి ఎవరికీ కనిపించకుండా పరారయ్యాడు.
వివరాలలోకి వెళితే..బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు 20 ఏళ్ల క్రితం బంగారుపాళేనికి వచ్చి నెహ్రూ వీధిలో ఓంశక్తి భక్తునిగా సేవలు చేసేవాడు. దాతల సహాయంతో చందాలు సేకరించి ఓం శక్తి పేరిట ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ నిత్య అన్నదానం చేసే వాడు. ఇలా చేయడంతో క్రమక్రమంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి ఆయన మీద బాగా నమ్మకం కుదిరింది. భక్తులతో ఓం శక్తి మాలలు వేయిస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది మేల్‌మరుత్తూర్ ఆదిపరాశక్తి గుడికి తీసుకెళ్లేవాడు. ఇలాంటి పనులు చేస్తూ ప్రజల లో తన మీద నమ్మకం పెరిగేలా చేసుకున్నాడు.
ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు తనని పూర్తిగా నమ్మిన తర్వాత ఓం శక్తి పేరుతో చిట్టీల వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ తరుణంలో అందరికీ అధిక వడ్డీ ఆశ చూపించి చాలామంది దగ్గర నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు.అతను ఇచ్చిన చెక్కుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పేరు రాసి చెల్లని చెక్కులు ఇచ్చి అందరిని మోసం చేశాడు. గత నాలుగు రోజుల నుండి ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో పలువురు వ్యక్తులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ తరుణంలో ఆంజనేయులు సొంతూరు బాపట్లకు వెళ్లి ఆయన కోసం ఆరా తీసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఆంజనేయులు ఇలా కనిపించకుండా పోవడంతో తమ డబ్బులు పోగొట్టుకున్నాము అని గ్రహించిన బాధితులు ఆదివారం డి ఎస్ పి నీ కలిసి జరిగిన విషయం చెప్పి ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ఆంజనేయులు మోసం చేసిన వారిలో బంగారుపాళేనికి చెందిన లీలమ్మ నుంచి రూ.97 లక్షలు, డి.కిశోర్ నుంచి రూ.50 లక్షలు, రమేష్ నుంచి రూ.34 లక్షలు ఇలా సుమారు 200 మంది నుంచి దాదాపు రూ.25 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు బాధితులు డీఎస్పీకి తెలిపారు. ఈ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.