రోడ్డు ప్రమాదం.. చావు అంచులకు వెళ్లిన విద్యార్థిని కాపాడిన నర్సు!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు చుట్టూ జనాలు గుమిగూడి ఆ యాక్సిడెంట్ అయిన వారిని ఫోటోలు తీస్తుంటారు. ఇంకొందరు అయితే చూసి కూడా చూడనట్టుగా వెళ్ళి పోతూ ఉంటారు. అయితే ఒక నర్సు మాత్రం రోడ్డుపై పడిపోయి ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే… ఒక యువకుడు రోడ్డుపై సృహ లేకుండా పడి ఉన్నాడు. అతడి బండి కొద్దిదూరంలో పడి ఉంది. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని అర్థమవుతుంది.

ఇంతలో ఒక నర్సు అక్కడికి చేరుకుని అతని ఛాతీపై ప్రెజర్ చేస్తూ అతన్ని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమవుతుంది అని అక్కడ ఉన్న వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత యువకుడు కదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడి ప్రాణాలు కాపాడిన నర్స్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లోని మన్నార్‌గుడి ప్రాంతంలో డిసెంబరు 3న సాయంత్రం జరిగింది. మన్నార్ గుడి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సుగా పని చేస్తున్న వనజ సకాలంలో ఓ నిండు ప్రాణాన్ని కాపాడటంపై అందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

బైక్‌పై నుంచి పడిపోయిన విద్యార్థి వసంత్‌కు సకాలంలో సేవలందించడం పట్ల పలువురు ఆమెను కొనియాడుతున్నారు. వనజ వారాంతపు సెలవుల సందర్భంగా తన కుటుంబంతో కలిసి కారులో బయల్దేరారు. మధుక్కూర్ నుంచి మన్నార్ గుడి వెళ్తున్న క్రమంలో లెక్కనం పెట్టయ్ వద్ద వసంత్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించారు. ఆ విద్యార్థి చుట్టూ ఉన్న జనాన్ని పక్కకు పంపించి ఆమె 30 సెకన్లపాటు కార్డియో పల్మనరీ రిససియేషన్ చేసింది.అనంతరం విద్యార్థి నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు. మరో రెండు నిమిషాలపాటు అదే విధంగా సేవలందించే సరికి అతను నడవగలిగే స్థాయికి చేరాడడంతో.. అతన్ని 108 అంబులెన్సు ద్వారా తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.