రెండు అగ్ర ఛానళ్ల మధ్య కుమ్ములాట. నువ్వా? నేనా? అన్న పోరు! ఆ పోరులో వ్యక్తిగత దూషణలు..ఒకరిపై ఒకరు రాళ్లు..వదిలితే కత్తులతో దాడికే యత్నించేలా ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఎన్టీవీ-టీవీ-5 మధ్య ఒక్కసారిగా మీడియా వార్ మరోసారి తెరపైకి వచ్చింది. రెండు ఛానళ్లు తమ భోగాతాలు బయట పెట్టుకునే ప్రయత్నం చేసాయి. నిన్నటి రోజంతా ఆ రెండు ఛానళ్లు అదే పనిమీద ఉన్నాయి. వాటిని కవర్ చేస్తూ మిగతా అగ్ర ఛానల్స్ అన్నీ కూడా అదే పనిపెట్టుకున్నాయి. టీఆర్పీల కోసం ఎలా పోటీ పడతాయో! నిన్న ఆ రెండు ఛానల్స్ మీడియా కథనాలతో తన్నుకుంటుంటే! మిగతా ఛానల్స్ ఎవరికి అనుకూలంగా వాళ్లు వాడేసుకున్నారు.
ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి-టీవీ-5 చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య మళ్లీ వివాదాలు పొడసాగినట్లే కనిపిస్తోంది. ఇరువురి ఛానెల్స్ లో ఒకరిపై ఒకరు మీడియా నైతిక విలువలు దాటి విమర్శలు చేసుకున్నాయి. ఒక ఛానల్ చేసిన తప్పులను మరో ఛానల్ లో ఎత్తి చూపుకుని అసలైన మీడియా అంటే? ఇలా ఉంటుందని చెప్పకనే చెప్పాయి. ఒకరు జూబ్లీ హిల్స్ సోసైటీ గురించి చెబితే ఇంకొకరు నెత్తిమీద వెంట్రులకు మొలిపించే ఆయిల్ పై ఎక్స్ క్లూజివ్ కథనాలతో మోతెక్కించారు. మీడియా వాళ్లు అంటే ఇలా ఉంటారా? అని ఓ కామన్ మ్యాన్ కి కూడా అర్దమయ్యేలా రచ్చ చేసారు. అయితే ఇలాంటి వివాదం ఆ రెండు ఛానళ్లకు కొత్తేం కాదు.
గతంలోనూ ఇలాంటి వివాదం ఆ రెండు ఛానళ్ల మధ్య రేగింది. రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఛానల్స్. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రెండు ఛానల్స్ అధినేతల్ని కూర్చొబెట్టి పంచాయతీ సెటిల్ చేసారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు మళ్లీ ఇప్పుడిలా రచ్చకెక్కారు. ఇందులో ఒక ఛానెల్ ఇటీవలి కాలంలో వైకాపా కు మద్దతుగా ఉంటే…మరో ఛానల్ జగన్ వ్యతిరేకి. ఇప్పుడు ఈ రెండు బాహా బాహీకి దిగడం సర్వత్రా చర్చకొచ్చింది. పొలిటికల్ కారిడార్ లో ఆసక్తికర సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్ కి ముగింపు పలకడానికి చంద్రబాబు మళ్లీ సీన్ లోకి దిగుతారా? అన్నది చూడాలి.