CM Ys Jagan : టీడీపీ ప్రజా వేదిక వద్దు.! టీడీపీ లిక్కర్ మాత్రం ముద్దు.!

CM Ys Jagan : టీడీపీ హయాంలో నిర్మితమైన ప్రజా వేదికను అక్రమ కట్టడంగా తేల్చి కూల్చేసింది వైఎస్ జగన్ సర్కారు. మరి, టీడీపీ హయాంలో ఆమోద ముద్ర పడినట్లుగా చెప్పబడుతున్న చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్లను ఎందుకు అందుబాటులోకి తెచ్చినట్లు.? ఒక్కటే ప్రశ్న.! ఈ ప్రశ్నకు వైఎస్ జగన్ సర్కారు సూటిగా సమాధానం చెప్పగలుగుతుందా.? లేదా.?
చంద్రబాబు హయాంలో రాజధానిగా ప్రకటితమైన అమరావతి విషయంలో వైసీపీ విధానమేంటో అందరికీ తెలిసిందే. మూడేళ్ళుగా అమరావతి అభివృద్ధికి నోచుకోలేదు. అమరావతి విషయంలోనూ, ప్రజా వేదిక విషయంలోనూ, మరో విషయంలోనూ వైఎస్ జగన్ సర్కారు, ‘టీడీపీ ముద్ర’ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. కానీ, మద్యం విషయంలో మాత్రం, టీడీపీ పాలనలోని నిర్ణయాలకు అనుగుణంగా ముందడుగు వేస్తున్నామని చెప్పడం దేనికి సంకేతం.?
సరే, చెత్త బ్రాండ్ల మద్యంతో ప్రజల ప్రాణాలకు ఎంత నష్టం.? అన్నది వేరే చర్చ. సాధారణ బ్రాండ్ల మద్యం అందుబాటులో లేకుండా, చెత్త మద్యం బ్రాండ్లను ప్రజల మీద బలవంతంగా రుద్దడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.? అన్నదానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి ముఖ్యమంత్రి హోదాలో. కానీ, ఆయన చెప్పరాయె.
విపక్షం రాజకీయమే చేస్తుంది. ఎవరు విపక్షంలో వున్నా అంతే. గతంలో వైసీపీ చేసింది కూడా అదే. మద్య నిషేధం చేస్తామని ఓట్లడిగి, అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ‘సారా చంద్రబాబు’ అనేసి చేతులు దులుపుకుంటామంటే కుదరన్న విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చెప్పగలిగేదెవరు.?