NTR District : వైఎస్ జగన్ సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకోగానే, ముందుగా చర్చనీయాంశమైన అంశం ‘ఎన్టీయార్ జిల్లా’. స్వర్గీయ నందమూరి తారకరామారావుకి వైసీపీ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చిందంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇలాంటి ఆలోచన చేయలేకపోయారన్నది వైసీపీ విమర్శ. ఇందులో నిజం లేకపోలేదు కూడా.
నిజానికి, చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరగాల్సి వుంది. కానీ, చంద్రబాబు అప్పట్లో ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు, ముఖ్యమంత్రి అయ్యాక.. రెండున్నరేళ్లకి.. కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు కూడా.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ‘ఎన్టీయార్ జిల్లా’ అంటూ చేసిన వ్యాఖ్యలకు కట్టబడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్టీయార్ జిల్లా ఏర్పాటుకి ముఖ్యమంత్రి అయ్యాక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఈ క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళుతుందా.? వైసీపీ ఖాతాలోకి వెళుతుందా.? అన్నదే అసలు సమస్య.
స్వర్గీయ ఎన్టీయార్ పేరు పెట్టారు సరే, వంగవీటి మోహన రంగా పేరు ఎందుకు పెట్టరంటూ ‘కాపు సామాజిక వర్గం’ నిలదీస్తోందిప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో, రేపో మాపో ఆ దిశగా ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదిలా వుంటే, ఎన్టీయార్ జిల్లా.. అని పేరు పెట్టినా, కమ్మ సామాజిక వర్గంలో వైసీపీ పట్ల సానుకూలత పెరుగుతున్నట్లు కనిపించడంలేదు. ఎన్టీయార్ అభిమానులు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారట. ఈ విషయమై అధికార వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలే ఆశ్చర్యపోతున్నారు.