అది మహా పాదయాత్ర కాదు.. దాన్ని పాప పరిహార యాత్రగా భావించాల్సి వుంటుంది. ఆ పేరు పెట్టుకుంటే ఎంతో కొంత పాప పరిహారం జరుగుతుందేమో.. అంటూ అమరావతి రైతులు తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర’కు సరికొత్త పేరు పెట్టింది వైసీపీ.
ఇక్కడ వైసీపీ విమర్శ నేరుగా తెలుగుదేశం పార్టీ పైనే. మహా పాదయాత్ర పేరుతో అమరావతి రైతుల ముసుగులో కొందరు టీడీపీ మద్దతుదారులు రెచ్చగొట్టే రీతిన వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ ఆరోపణ. మహా పాదయాత్ర రూట్ మ్యాప్ చూస్తే, కుట్ర కోణం అర్థమవుతుందని అంటున్నారు వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని.
అమరావతి పరిరక్షణ సమితి ఈ మహా పాదయాత్ర నిర్వహిస్తుండగా, తెరవెనుకాల తతంగం నడిపిస్తున్నది తెలుగుదేశం పార్టీనే. పైకి పేరు అమరావతి పరిరక్షణ సమితిదే గనుక, బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు, వామపక్షాలు, జనసేన కావొచ్చు.. ఈ యాత్రకు మద్దతిస్తున్నాయి.
యాత్ర సందర్భంగా కొందరు మీడియా సాక్షిగా చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, యాత్రకి చేపడుతున్న భారీ జన సమీకరణ.. ఇవన్నీ రాజకీయ కోణాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ, ఈ యాత్ర విషయంలో పూర్తిగా సంయమనం పాటిస్తోంది.
అయితే, వైసీపీ ప్రభుత్వమే టార్గెట్‌గా చేసుకుని అమరావతి పరిరక్షణ సమితి నిర్వాహకులు చేస్తున్న వ్యాఖ్యలతో, వారిపై వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ తప్పడంలేదు. పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి అందుతున్న విరాళాలు సహా, అనేక అంశాలపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సరైన సమయంలో ఈ కుట్ర బట్టబయలవుతుందన్నది వైసీపీ వాదన.