ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు రాజధానులు నిర్మించి చూపిస్తామంటూ వైఎస్ జగన్ సర్కారు ఘనంగా ప్రకటించుకుంది. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.. రాష్ట్రానికి మాత్రం రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి. మూడు రాజధానుల సంగతి తర్వాత, అసలంటూ వున్న ఒకే ఒక్క రాజధాని అయినా సమీప భవిష్యత్తులో నిర్మాణం పూర్తి చేసుకుంటుందా.? లేదా.? అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మాట వాస్తవం. కరోనా దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నదీ వాస్తవమే. కానీ, రాష్ట్రానికి చెన్నై, బెంగళూరు, హైద్రాబాద్ వంటి నగరాలతో పోల్చదగ్గ నగరం లేదంటూ వైఎస్ జగన్ అసెంబ్లీలో ఎందుకు ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ఇలా ఆవేదన వ్యక్తం చేస్తే రాష్ట్రం పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమైపోవాలి.? చంద్రబాబు హయాంలో ఏం జరిగింది.? అన్నది వేరే చర్చ. రాజధాని పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడితే, చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, అది సాకుగా చూపి.. అమరావతిని ఆపడం తగదు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామంటున్న ప్రభుత్వం, ఆ స్థాయిలో అయినా అమరావతిని తొలుత మరింత అభివృద్ధి చేయగలిగితే, ఆ తర్వాత మిగతా రెండు రాజధానుల విషయమై ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుందని ప్రజలు విశ్వసించగలుగుతారు. నానాటికీ రాష్ట్రం మరింతగా అప్పుల్లో కూరుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు కాగల రాజధాని అవసరం. రాజధాని నగరం వుంటే, అక్కడి నుంచి వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకి ఊతమిస్తుంది. ఈ దిశగా జగన్ సర్కార్ ఆలోచన చేయకపోతే, మూడు రాజధానులనే ఆలోచన అర్థం పర్థం లేకుండా పోతుంది.
