నోములన్నీ ఫలించాయి … నాకేం కాలేదు దిట్టంగానే ఉన్నా

ఒకప్పటి ఫైర్ బ్రాండ్ నోముల నర్సింహయ్య ఎర్రజెండా వదిలేసి గులాబి జెండా పట్టుకున్నారు. నాగార్జన్ సాగర్ నియోజకవర్గం నుంచి ఏకంగా మాజీ హోంశాఖ మంత్రి జానారెడ్డీనే ఓడించి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఎన్నో ఆటు పోట్లను చూసిన ఆయనకు ఇప్పుడు కొత్త సమస్యలు చికాకు తెప్పిస్తున్నాయి. 

పుకార్లు షికార్లు చేసే విధంగా సోషల్ మీడియాలో నోముల నర్సింహయ్య ఆరోగ్యం మీద ప్రచారం జోరందుకుంది. అయితే ప్రత్యర్థి పార్టీ నుంచి కాకుండా సొంత పార్టీ నేతలే తన ఆరోగ్యం మీద ప్రచారం చేయిస్తుండడంతో చిరాకెత్తిపోతున్నారు నోముల. కుమారుడు భగత్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను తన సీటు మీద కన్నేసిన పార్టీలోని కొందరు పెద్దలు సోషల్ మీడియా వేదికగా దాడి చేయిస్తున్నారంటా.


నోముల నర్సింహయ్యకు ఆరోగ్యం బాగా లేదని వచ్చే ఎన్నికల్లో కుమారుడైన భగత్ ను రాజకీయాల్లోకి దించి ఆయన పక్కకు తప్పుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిస్తున్నారంటా కొంత మంది పెద్దలు. దీంతో నేరుగా నోముల తన నోటికి పని చెప్పాల్సి వచ్చింది. తన ఆరోగ్యం కుదురుగా ఉందని ప్రెస్ మీట్ లో విరుచుకుపడ్డారు. అయితే వామపక్షాల్లో పనిచేసిన అనుభవం కారణంగా స్వతహాగా నోములది దూకుడు స్వభావం… అయితే గత కొంత కాలంగా ఆయన స్వరం తగ్గింది, వేగం మందగించింది…దీనికి తోడు భగత్ యాక్టివ్ రోల్ పెరగడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. మరోవైపు భగత్ ఇప్పుడు నేరుగా అధికారులకు ఫోన్లు చేసి పనులు చక్కబెట్టుకుంటున్నారంటా. పార్టీ నేతలకు కూడా ఫోన్ చేసి ఇకపై అధికార అనధికార కార్యక్రమాలకు తనను ఆహ్వానించాలని కోరుతున్నాడంటా. ఇదే అదునుగా నోముల సీటుపై కన్నేసిన కొంత మంది పెద్దలు ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ఆయనపై దాడి పెంచారంటా. నోముల ఆరోగ్యంపై ఇప్పుడు నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయంటా. అదండీ సంగతి. స్వపక్షంలోని విపక్షం దెబ్బకు చిరాకుపడిపోతున్నారు ఈ మాజీ కామ్రేడ్.