ఆంధ్రపదేశ్ సీఐడీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆసక్తికరమైన స్పష్టతనిచ్చింది. రఘురామ కాలికి గాయాలున్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదన్నది ఏపీ సీఐడీ ప్రకటన సారాంశం. అదే నిజమైతే, ఇంత రాద్ధాంతం ఎందుకున్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. తనను ఏపీ సీఐడీ అరెస్టు చేశాక, తనపై దాడి జరిగిందని స్వయానా రఘురామ చెబుతున్నారు. చెప్పడమేంటి.? కోర్టు ముందుకు ఆ విషయాన్ని తీసుకెళ్ళారు కూడా. ఈ క్రమంలోనే నానా యాగీ జరిగి, చివరికి సుప్రీంకోర్టు సూచనతో ఆయన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. రఘురామకు సాధారణ ఎడిమాతోపాటు, ఆయన కాలికి గాయాలున్నట్టుగా ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇవ్వడంతోనే, సుప్రీంకోర్టు బెయిల్ అందించిందనేది నిన్నమొన్నటిదాకా వినిపించిన వార్తల తాలూకు సారాంశం. ఇప్పుడంతా నిజం కాదని అనుకోవాలా.? ఏపీ సీఐడీ ప్రకటనతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనల ప్రకారం చూస్తే, రఘురామ కాలికి గాయాలున్నాయి.
ఈ గాయాలు, రఘురామ విజయవాడ నుంచి ఆర్మీ ఆసుప్రతికి వెళ్ళే క్రమంలో జరిగినవని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారంటూ కథనాలొచ్చాయి. మరోపక్క, రఘురామ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కాళ్ళకూ బ్యాండేజ్ వేశారు అధికారులు. అధికార పార్టీకి చెందిన రెబల్ ఎంపీకి సంబంధించి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.? ప్రతి విషయమూ ఎందుకింత వివాదాస్పదమవుతోంది.? అసలు ఏపీ సీఐడీ చెప్పాలనుకున్నదేంటి.? అసలు విషయమైన రాజద్రోహం వ్యవహారం పక్కకుపోయి.. ఈ గాయాల వ్యవహారం చుట్టూ ఎందుకింత రాద్ధాంతం జరుగుతోందోగానీ, ప్రస్తుతానికైతే ఇదంతా ఓ మిస్టరీగా మారిపోయింది. సానుభూతి కోసం రఘురామ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల్ని పూర్తిగా కొట్టిపారేయలేం. అదే సమయంలో, పోలీసులు అరెస్టు చేశాక రఘురామ ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంపైనా లైట్ తీసుకోలేం. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతోంది గనుక.. విచారణలో నిజా నిజాలు నిగ్గు తేలాల్సి వుంది.