ఆంధ్రపదేశ్ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకోగల ఒక్క అర్హుడైన నాయకుడూ లేడా.? ఇప్పుడు తెలుగు నాట ఇదే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగానూ ఈ చర్చ గట్టిగానే సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నిన్ననే తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో డజను మంది పాతవారికి ఉద్వాసన పలికారు. కొత్తగా చాలామందికి అవకాశం కల్పించారు.
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. ఆయన నిన్నటిదాకా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. ఇప్పుడు క్యాబినెట్ హోదా దక్కిందాయనకు.. పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు కిషన్ రెడ్డి. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకొస్తాం జనసేనతో కలిసి.. అంటోంది బీజేపీ. మరి, ఆ ఉద్దేశ్యమే వుంటే.. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యత వుండాలి కదా.? ఆ పాటి ఇంగితం బీజేపీ అధిష్టానానికి లేకుండా పోయింది.
మిత్ర పక్షం జనసేనకు అవకాశం ఇచ్చే ఉద్దేశ్యం లేకపోతే పోయింది.. కనీసం, ఏపీ బీజేపీ నేతల్లో ఎవరో ఒకరికి ఆ అవకాశం కల్పించొచ్చు కదా.? ఎక్కడ కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాల్సి వస్తుందోనన్న కోణంలో, ఏపీ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుని, మిజోరాం గవర్నర్ పదవికి ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. అలా కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్ళే అవకాశాన్ని ఏపీ కమల నాథులు కోల్పోయారన్నమాట.
ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రీ లేనప్పుడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఎవరైనా ఎందుకు ఓటెయ్యాలి.? అన్న చర్చ జరగడం సహజమే. గతంలో ఏపీ నుంచి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు.. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా పనిచేశారు నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో. కానీ, అది టీడీపీ కోటా. టీడీపీ – బీజేపీ కూటమిగా పనిచేశాయి అప్పట్లో. మొత్తమ్మీద, మోడీ కేంద్ర మంత్రి వర్గ కూర్పు చూస్తోంటే, ఆంధ్రపదేశ్ మీద బీజేపీకి అస్సలు ఆశలు లేనట్టే వున్నాయ్.