ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెలకు చెల్లించాల్సిన జీతాల్ని ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. జులై ఒకటో తారీఖున పడాల్సిన జీతాలు ఇంకా అకౌంట్ లో పడలేదు. దీంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. ఇదేం చోద్యం అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని కొంత మంది ఉద్యోగులు ముందే ఊహించారు. దీంతో నెలవారి క్రమం తప్పకుండా చెల్లించాల్సిన ఈఎమ్ ఐలు, బ్యాంక్ లు లోన్లకు సంబంధించి ఎవరి ఏర్పాట్లలో వాళ్లున్నారు. తాజాగా ఈ పరిస్థితి ని ఉద్దేశించి మంత్రి కురసాల కన్నబాబు ఉద్యోగులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
జీతాలు పడక పోవడానికి కారణం ప్రభుత్వం తప్పిదం కాదని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన పనివల్లే జీతాలు ఇవ్వలేకపోయామన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమెదం పొందకుండా శాసనమండలిలో టీడీపీ నాయకులు అడ్డుకోవడం వల్లే ఖజానాలో డబ్బులు తీయలేకపోయామన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కక్ష పూరిత చర్య వల్లే ఉద్యోగులంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని విమర్శించారు. అయితే ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గవర్నర్ శనివారం బిల్లును ఆమోదిస్తే జీతాలు వెంటనే అకౌంట్ పడతాయని తెలిపారు. బిల్లుకు అడ్డు తగిలినందుకు చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేసారు.
ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైన ఫించన్లు ఆలస్యం కాలేదన్నారు. నగదు రూపంలో డ్రా చేసి ఫించన్లు అన్ని పంపిణీ చేసామ న్నారు. అలాగే రాష్ర్టంలో పరిస్థితులన్నింటి ప్రజలు సహా అందరూ అర్ధం చేసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత పథకాల అమలు విషయంలో ఎలా అడ్డు తగులుతున్నారా? గమనించాలన్నారు. మంచి పనులకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే ప్రతిపక్షం రెండడుగులు వెనక్కి లాగుతుందని మండిపడ్డారు. ఇక అలాంటి పరిస్థితులు ఉండవని..అన్నింటికి చెక్ పెట్టడానికి రంగం సిద్ధమవుతుందని వ్యాఖ్యానించారు.