ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో చేరడానికి నేతలు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు క్యూలో నిలబడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగాభిన్నంగా తయారు అయ్యాయి. పార్టీలో చేరడానికి ఏ నేత ముందుకు రాకపోగా ఉన్న నేతలు బయటకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.
పదవులు వద్దంటున్న టీడీపీ నేతలు
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులకు పెద్ద పోటీ ఉండేది. పార్టీ పదవుల ద్వారా తమ పలుకుబడి పెంచుకుందామనే ఉద్దేశంతో నాయకులంతా తీవ్రంగా పోటీ పడేవారు. ఈ క్రమంలో కొంతమంది నామినేటెడ్ పోస్టులను సైతం ఏకం చేసి మరీ పార్టీ పదవులను స్వీకరించేవారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అంటే ఆ స్థాయిలో క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిలిచి పదవులు ఇస్తామని మొత్తుకుంటున్నా, తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ పదవులను స్వీకరిస్తే రానున్న రోజుల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి ఉంటుంది. అలా చేసి పోలీసుల విచారణలు ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే పార్టీ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేకపోవడం వల్ల అనేకమంది నేతలు అసలు చంద్రబాబు నాయుడుని కలవడం కూడా మానేశారు.
టీడీపీ పతనానికి చేరువలో ఉందా!
పార్టీ తరపున నిలబడి పోరాడే నాయకులు లేకపోవడంతో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ఇప్పటికే ప్రజల ఆదరణ తక్కువ అవ్వడంతో చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహాలు రచిస్తున్నప్పటికి ప్రజల దగ్గర నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు పట్టుకున్నప్పుడే పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పార్టీ పతనం అవ్వడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.