తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క కేంద్ర మంత్రి వున్నారు. ఆయనే కిషన్ రెడ్డి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారాయన. ప్రధాని నరేంద్ర మోడీ అతి త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండు డజన్ల మందికి పైగా కొత్తగా కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం వుందంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, ఆంధ్రపదేశ్ పరిస్థితేంటి.? తెలంగాణ నుంచి ఇంకెవరికైనా అవకాశం దక్కుతుందా.? అంటే, ప్రస్తుతానికైతే ఆ అవకాశమే లేదన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న లీకుల సారాంశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ వుంటుందనే ప్రచారం జరుగుతుండగా, ఆయన స్థానంలో మరొకరికి అవకాశమిస్తారేమోనన్న ఊహాగానాలూ తెరపైకొస్తుండడం గమనార్హం.
మరోపక్క, ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి పలువురు ఆశావహులు కేంద్ర మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లిస్టులో అందరికన్నా ముందున్న పేరు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సుజనా చౌదరి, ఆ తర్వాత బీజేపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఎక్కువ.
ఆ పరిచయాలతోనే బీభత్సంగా లాబీయింగ్ చేసేస్తున్నారట. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారంటూ జరిగిన, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదట. అసలు పవన్ కళ్యాణ్ సైతం రాజ్యసభకు వెళ్ళేందుకుగాని, కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకుగానీ సుముఖంగా లేరంటున్నారు.
అయితే, 2022 – 23 మధ్య ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొందరికి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం వుందనీ, ఆ లిస్టులో జనసేన నుంచి ఒకరికి అవకాశం లభించొచ్చనీ అంటున్నారు. ఇలా ఆశపెట్టి ఊరించడం తప్ప, తెలుగు రాష్ట్రాల్ని కేంద్రంలోని మోడీ సర్కార్ ఏ రకంగానూ ఉద్ధరించింది లేదన్నమాట.