భారతదేశంలో వ్యాక్సిన్ ధర అత్యధికంగా 3 వేల రూపాయలు (రెండు డోసులు కలుపుకుని). వ్యాక్సిన్ మాత్రమే కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఓ ఉద్యమంలా నిర్వహిస్తే, దేశంలో ఎవరికీ కరోనా కారణంగా చనిపోవాల్సిన ఖర్మ పట్టదు. కానీ, ప్రభుత్వాలు ఆ పని చెయ్యవు, చెయ్యలేవు.
కరోనా వైరస్ ఏడాదిన్నర క్రితం దేశంలోకి వచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై కూడా నెలలు గడుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. రెండు మూడు నెలల్లోనే మొత్తంగా అందరికీ వ్యాక్సినేషన్ అందించగల స్థాయిని సంతరించుకున్నాయి. కానీ, వ్యాక్సిన్లు అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవు. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల కోసం పరిహారాన్ని ప్రకటిస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.
కేంద్రం కూడా తనవంతుగా ముందుకొచ్చింది. మంచి ప్రయత్నమే ఇది. కానీ, మనిషి చనిపోకుండా చర్యలు తీసుకునే అవకాశం వుండీ, ఆ చర్యలు తీసుకోలేకపోతున్న ప్రభుత్వాలు, పరిహారం ప్రకటించడం ద్వారా పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.? రాష్ట్రాలు గ్లోబల్ టెండర్ల కోసం ప్రయత్నిస్తున్నాయి.. వ్యాక్సినేషన్ విషయమై. ఇక్కడా కేంద్రం అడ్డుపుల్ల వేస్తోందన్నది నిర్వివాదాంశం.
కేంద్రం అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు భారతదేశంలోని ఏ రాష్ట్రానికీ దక్కే అవకాశమే లేదు. అలాంటప్పుడు, కేంద్రమే ఆయా దేశాల్లోని వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు కదా.? భారతదేశంలో 140 కోట్లమంది జనాభా వున్నారు గనుక, ఆ స్థాయిలో వివిధ దేశాలు వ్యాక్సిన్లను సరఫరా చేయలేకపోవచ్చు. కానీ, ఎంతో కొంత స్థాయిలో చేయగలుగుతాయి.
నిజానికి, మోడెర్నా వంటి కొన్ని వ్యాక్సిన్లను భారతదేశంలోకి తెచ్చేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. కానీ, అప్పట్లో కేంద్రం లైట్ తీసుకుంది. అలా కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్యం.. ఇప్పుడు దేశంలో మరణమృదంగానికి కారణమైంది. తమ వైఫల్యాల్ని ఇలా పరిహారంతో కప్పిపుచ్చుకోవాలని ఎవరు ప్రయత్నించినా అంతకన్నా దుర్మార్గం ఇంకోటుండదు.