కార్యనిర్వాహక రాజధాని కాదు, పైలట్ రాజధానిగా విశాఖ.?

రాజధాని అంటే కేవలం రాజధాని మాత్రమే.! దీనికి ముందూ వెనుకా ఏవేవో పేర్లు పెడితే, అవి రాజధానులెలా అవుతాయ్.? అయినాగానీ, రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాల్సిందేనంటోంది వైసీపీ సర్కారు. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇంకోటి జ్యుడీషియల్ క్యాపిటల్.. అదేనండీ న్యాయ రాజధాని. మూడోది శాసన రాజధాని.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనీ, కర్నూలుని న్యాయ రాజధాని అనీ, అమరావతిని శాసన రాజధాని అనీ పేర్కొంటూ, మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టి, పాస్ చేయించేసుకునట్లు పేర్కొన్నా, న్యాయ వివాదాల నేపథ్యంలో ఆ బిల్లుని వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

‘ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని..’ అని ఆ మధ్య ఓ సందర్భంలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సో, ఆ లెక్కన, ఎప్పటికప్పుడు రాజధానులు మారిపోతుంటాయన్నమాట. ఇదెక్కడి వింత.? ఏమోగానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాల్సిన విశాఖకు కొత్త పేరు పెడుతోందిట వైఎస్ జగన్ సర్కారు. దీని పేరు పైలట్ రాజధాని అట.

శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని, పైలట్ రాజధాని నుంచి పరిపాలన చేపడతారట వైఎస్ జగన్. అంటే, వారంలో మూడు రోజులు విశాఖలో వుండి, అక్కడి నుంచే రాష్ట్రాన్ని వైఎస్ జగన్ పరిపాలిస్తారట. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇదే గనుక నిజమైతే, రాష్ట్రం నెత్తిన ఇదో పెద్ద భారం.. అని చెప్పక తప్పదు. అధికారులు అమరావతి నుంచి విశాఖకు వెళ్ళి రావాల్సి వుంటుంది. ముఖ్యమైన శాఖల అధిపతులూ అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. ఇంత రిస్క్ ముఖ్యమంత్రి తీసుకునే అవకాశమే లేదు. మూడు రోజులు విశాఖలో వుంటే, మూడు రోజులు కర్నూలులో వుండరా.? అన్న ప్రశ్నకి వైఎస్ జగన్ సమాధానం చెప్పగలిగే పరిస్థితి వుండదు.