No Cinema’s : సినిమాల్లేవ్.. ఈ చెత్త రాజకీయం ఎందుకు?

No Cinema’s : తెలుగు సినిమాకి గ్రహణం పట్టింది. అది రాజకీయ గ్రహణమా.? కరోనా గ్రహణమా.? సినీ గ్రహణమా.? అన్నది వేరే చర్చ. ఈ సంక్రాంతికి పెద్ద తెలుగు సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రావడంలేదు. నిజానికి, మూడు పెద్ద సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘రాధేశ్యామ్’ వచ్చి వుండాలి. కానీ, కరోనా దెబ్బకి.. ముగ్గురూ సైడ్ అయిపోయారు. ఇందులో ‘భీమ్లానాయక్’ని కుట్రపూరితంగా ‘కొందరు’ పక్కకు తప్పించేశారనుకోండి.. అది వేరే సంగతి.

పెద్ద సినిమాల్లేనప్పుడు, సినిమా థియేటర్లలో టిక్కెట్ల గురించిన రచ్చలో అర్థమే లేదు. మళ్ళీ సినిమా పరిశ్రమకు సంబంధించి సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ, సినిమా టిక్కెట్ల వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే వుంది.

టైమ్ చూసి రామ్ గోపాల్ వర్మ, వివాదాన్ని మరింతగా కెలికి పారేశాడు. ఎడా పెడా ఇంటర్వ్యూలు ఇచ్చేసి, ట్వీట్లు వేసేసి.. కావాల్సినంత పబ్లిసిటీ అయితే పొందాడు. వర్మ ఏదో ఉద్ధరించేస్తాడని ఎదురుచూసిన కొందరు నెటిజన్లు కూడా ఇప్పుడు నిరాశకు గురవ్వాల్సి వచ్చింది.

‘మాట్లాడుకుందాం రండి..’ అంటూ మంత్రి పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మకి సోషల్ మీడియా ద్వారానే ఆహ్వానం పలకడంతో, ‘థ్యాంక్స్’ చెప్పిన ఆర్జీవీ, ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పుకురావడం గమనార్హం.

ఆర్జీవీ అంటేనే అంత. ఈ సమయంలో ఇంత పబ్లిసిటీ కావాలనే లెక్కలేసుకుని మరీ వివాదాల్ని రాజేస్తుంటాడు. ఇక్కడా అదే జరిగింది. ఇప్పటిదాకా ఆర్జీవీ ట్వీట్లకు రెస్పాండ్ అయిన సోకాల్డ్ అభిమానులంతా ఇప్పుడు జుట్టుపీక్కోవాల్సి వస్తోంది.