గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ గెలుస్తారా.? అన్న ప్రశ్నకు కొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. ఇప్పటికే ఎస్ఈసీ పంచాయితీ, ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం, పంచాయితీ ఎన్నికలకు ససేమిరా అంటోంది. వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ రేపు విచారణకు రాబోతోంది. దాంతో, సుప్రీం నిర్ణయం ఎలా వుంటుంది.? ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడుతారు.? అన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అనూహ్యంగా ఈ అంశంపై బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి కోడి పందాల్ని మించి, ఐపీఎల్ మించి.. రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు గురించి బెట్టింగులు జరుగుతుండడం గమనార్హం. ఎలా చూసినా, ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి షాక్ తప్పదనీ, గెలుపు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌దేనని మెజార్టీ అభిప్రాయపడుతున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం, గెలుపు తమదేనంటున్నాయి.
ఒకవేళ అందరి అంచనాలు నిజమై, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధిస్తే.? ఛత్.. ఆ ఛాన్సే లేదన్నది వైసీపీ నేతల వాదన. ఉద్యోగ సంఘాలు కూడా వైసీపీ బాటలోనే నడుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీకి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నాయి. నిజానికి, పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిపోయినట్లే. నోటిఫికేషన్ వచ్చేశాక, న్యాయస్థానాల జోక్యం ఎన్నికల విషయమై వుండకపోవచ్చు. ఇది న్యాయ నిపుణుల మాట. అదే నిజమైతే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. నిజానికి, పంచాయితీ ఎన్నికల్లో గెలవడం అనేది వైసీపీకి పెద్ద సమస్యే కాదు. కానీ, చిన్న సమస్యను జఠిలం చేసుకుంటోంది వైఎస్ జగన్ సర్కార్. అదే అసలు సమస్య.