నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సుప్రీం కోర్టు వద్దకు చేరిన సంగతి తెలిసిందే. తన పునర్నియామకం విషయమై, నిమ్మగడ్డ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హారిచందన్‌ను కలసి, తనను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకం విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాజాగా గవర్నర్ లేఖ రాశారు. ఈ నేపధ్యంలో వైసీపీ సర్కార్ వాదన రాజకీయవర్గాల్లో చర్చకు తెరలేపింది. గవర్నర్ నుండి ఆదేశాలు వచ్చిన నేపధ్యంలో నిమ్మగడ్డను ఏపీ ప్రభుత్వం తిరిగి నియమిస్తుందా లేదా అనే సంశయాలున్న క్రమంలో, జగన్ సర్కార్ ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదని తెలస్తోంది.
ఎందుకంటే.. హైకోర్టు తీర్పు, గవర్నర్ ఆదేశాలకు, ఏపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అందేకే సుప్రీం కోర్టుకు వెళ్ళామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం, ఏపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని, అయితే ప్రస్తుతం తాము సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇక ఇదే విషయం అంటే.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుందనే విషయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తామని తెలిపింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో, జగన్ సర్కార్ ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటీషన్ వేయగా, దీనికి సంబంధించి విచారణ జరగనుంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పును చూసిన తర్వాతనే నిమ్మగడ్డ విషయంలో నిర్ణయం తీసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీంతో అప్పటి వరకు నిమ్మగడ్డ వెయిట్ చేయాల్సిందేనా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.