వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 వ సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలు. స్థానిక ఎన్నికలు అంటే చంద్రబాబుకు ఎప్పుడూ భయమే. ఆయన పదునాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఏనాడూ పంచాయితీ ఎన్నికల జోలికి పోలేదు. ప్రత్యేక అధికారుల పాలనతోనే పొద్దు పుచ్చారు. 2019 లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా పరాజయం పాలైంది. అఖండమైన మెజారిటీతో వైసిపి అధికారంలోకి వచ్చింది. దాంతో చంద్రబాబు తీవ్రమైన షాక్ కు గురయ్యారు.
ఏకపక్షంగా వాయిదా
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది నెలలకు స్థానిక ఎన్నికల నిర్వహణ మొదలైంది. జగన్ ప్రభుత్వమే ఎన్నికలసంఘాన్ని ఎన్నికలు జరపాల్సిందిగా కోరింది. ఆ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టంలోనే వైసిపి ఏకగ్రీవంగా పాతికశాతం వార్డులను గెల్చుకోవడంతో తెలుగుదేశం పార్టీకి వణుకు మొదలైంది. వారి ఒత్తిడితో కరోనా సాకు చెప్పి సగం జరిగిన ఎన్నికలను ఏకపక్ష నిర్ణయంతో వాయిదా వేశారు నిమ్మగడ్డ. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ అలాంటి పక్షపాత నిర్ణయం తీసుకున్నారని వైసిపి ఆరోపించింది.
కోర్టు ద్వారా అనుకున్న పని అయింది
ఆ తరువాత నిమ్మగడ్డ అదృష్టమో ఏమో కానీ కరోనా ప్రపంచం మొత్తం విజృంభించింది. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. డిసెంబర్ వరకూ ఆ పరిస్థితి కొనసాగింది. మొన్న జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ సిబ్బంది మొత్తం ఆ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సివచ్చింది. అలాంటి సమయంలో ఆగిపోయిన ఎన్నికలను మొదలుపెడతామని నిమ్మగడ్డ మళ్ళీ ఏకపక్షంగా ప్రకటించడంతో ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చింది. అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే హక్కు ఎన్నికల సంఘానికి ఉన్నదని చెప్పి కోర్టులు ప్రభుత్వ అభ్యంతరాలను త్రోసిపుచ్చాయి.
వందిమాగధుల స్తోత్రాలతో పులకించి….
రెండేళ్ల పాలన తరువాత ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండకపోతుందా అన్న ఆశతో తెలుగుదేశం పార్టీ యావత్తు నిమ్మగడ్డకు మద్దతుగా నిలబడింది. తెలుగుదేశం భజన చానెళ్లు, పత్రికలు అన్నీ నిమ్మగడ్డకు అనుకూలంగా విశ్లేషణలు, చర్చలు చెయ్యడం మొదలుపెట్టాయి. నిమ్మగడ్డను మరో టీఎన్ శేషన్ అని, ఆయన ప్రజాస్వామ్యాన్ని రక్షించిన మహా వీరుడు శూరుడు అంటూ పొగడ్తలవర్షం కురిపించాయి. నిమ్మగడ్డకు కొన్ని చోట్ల మంగళహారతులు, క్షీరాభిషేకాలు కూడా జరిగాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా అఖండ స్వాగతాలు లభించాయి. దాంతో నిమ్మగడ్డ కూడా తాను ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అవతరించిన యుగపురుషుడుని అనే భ్రమల్లో విహరించారు. అత్యంత నిరంకుశంగా వ్యవహరించి అధికారులతో, వ్యవస్థలతో చెడుగుడు ఆదుకున్నారు. నిమ్మగడ్డ విశృంఖలత్వాన్ని తెలుగుదేశం పార్టీ, ఆయన పచ్చమీడియా విపరీతంగా ఎంజాయ్ చేశాయి. జగన్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన యోధుడంటూ ఆయనకు స్తోత్రాలు పలికారు.
మింగుడు పడని ఫలితాలు
తీరా ఎన్నికలు జరిగాక ఏమైంది? పల్లెలు, పట్నాలు, నగరాలు మొత్తం వైసిపి ఊడ్చిపారేసింది. వైసిపి పెనుతుఫానుకు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన లాంటి పార్టీలు పూరిగుడిసెలు లేచిపోయినట్లు ఎగిరిపోయాయి. ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ ఉనికిని కోల్పోయాయి. జనసేన పార్టీ ఇరవై లోపు వార్డులు గెలుచుకుని అడ్రస్ లేకుండా పోయింది.
కోర్టుద్వారానే నెరవేరిన కోరిక!
ఇక మిగిలినవి కొన్ని ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు. వీటిని జరపడానికి ఆరురోజుల సమయం చాలట. వాటిని కూడా జరపమని నిమ్మగడ్డను ప్రభుత్వం కోరింది. కానీ, మొన్నటి ఫలితాలతో తీవ్రమైన షాక్ కు గురైన నిమ్మగడ్డ ఇక ఆ ఎన్నికలు కూడా జరిపితే తెలుగుదేశం పూర్తిగా గల్లంతై పోతుందని భయపడి ఎన్నికలు జరపను ఫో అన్నారని వైసిపి వారు ఎద్దేవా చేస్తున్నారు. మిగిలిన ఎన్నికలు కూడా జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. అయితే “ఎన్నికల సంఘాన్ని అలా ఆదేశించలేము” అని హైకోర్టు ప్రభుత్వ పిటీషన్లను కొట్టేయడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు నిమ్మగడ్డ.
ఎన్నికలంటే పారిపోయారు….
ఒకప్పుడు ఎన్నికలు జరిపి తీరాలని కోర్టుకు వెళ్లిన నిమ్మగడ్డ ఈనాడు ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ తాను ఎన్నికలను జరపలేనని ప్రకటించడం అంటే ఆయన ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు అని తేలిపోలేదా? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు చివరి నిముషం వరకూ పనిచేయాలనే కర్తవ్యాన్ని విస్మరించి ఎన్నికలంటే భయపడటం ఏమిటి? ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించలేనపుడు మిగిలిన పదిహేడు రోజులూ ప్రభుత్వం ఇచ్చే వేతనం తీసుకుంటూ కులాసాగా కాలక్షేపం చెయ్యడం సబబేనా? ఈ విషయంలో తెలుగుదేశం కానీ, వారి భజన చానెళ్లు కానీ ఒక్క చర్చను నిర్వహించడానికి కూడా వణికిపోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి పంజాదెబ్బ వారికి ఎంత బలంగా తగిలిందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం కు అనుకూలంగా ఫలితాలు వచ్చి ఉన్నట్లయితే నిమ్మగడ్డ ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రకటించేవారేనా అని వైసిపి నాయకులు నిలదీస్తున్నారు. మరి నిమ్మగడ్డ దగ్గర జవాబు ఉన్నదా?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు