Bayya Sunny Yadav: జ్యోతి మల్హోత్రాకి, బయ్యా సన్నీ యాదవ్ కి సంబంధాలు ఉన్నాయా.. కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ!

Bayya Sunny Yadav: ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బయ్యా సన్నీ యాదవ్. కాగా వ్లాగర్‌, బైక్ రైడర్, యూట్యూబర్‌ అయిన భయ్యా సన్నీ యాదవ్‌ ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెన్నైలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని అరెస్టు వ్యవహారం అతని స్వగ్రామం అయిన నూతనకల్ లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీ పై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా రవీందర్, అనూష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్.

అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బెట్టింగ్ యాప్స్‌ ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్‌ పై మార్చి 5వ నూతనకల్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. అదే సమయంలో కొందరు యూట్యూబర్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ తీసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన పహల్గామ్‌ ఉగ్ర దాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, యూట్యూబార్ సన్నీ యాదవ్ పాకిస్థాన్ లోనే ఉన్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పై గా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్ కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రముఖ యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 11 మందినీ ఎన్ఐఏ అరెస్టు చేసింది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది.

పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ రెండు వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్ లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్థాన్‌ ట్రిప్‌ పైనా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. పాక్ వెళ్లి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈనెల 29వ తేదీన చెన్నైలో అరెస్టు చేశారు. పాక్‌ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్‌ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అరెస్టైన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం, ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందట. ఈ విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ కూడా రానుంది.