New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకల్లో ‘ఒమిక్రాన్’ చిటికెలు.!

New Year Celebrations : కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే వేడుకలే.. న్యూ ఇయర్ వేడుకలు. డిసెంబర్ 31 రాత్రి 6 గంటల తర్వాతి నుంచి సంబరాలు షురూ అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

మనదేశంలోనూ గత కొంతకాలంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్దయెత్తున సొమ్ములు ఖర్చు చేయాల్సి వస్తోంది కూడా. నిజానికి, ఇదో పెద్ద బిజినెస్. గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. మనం కరోనా కోరల్లో చిక్కుకుని వున్నాం. మరి, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం ఎంతవరకు సబబు.?

తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం కొన్ని ఆంక్షలు విధించింది. అంతలోనే కొన్ని సడలింపులు ఇచ్చింది. మళ్ళీ కఠిన నిబంధనలు షురూ చేసింది. కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగీ డీజేలపై ఆంక్షలు విధించారు. డీజే లేకపోతే అసలు వేడుకలే లేవన్నట్టుగా తయారైంది గత కొంతకాలంగా పార్టీల పరిస్థితి.

డీజే వుండదు సరే.. మరి, ఏం చేయాలి.? కేరింతలెలా కొట్టాలి.? చిటికెలు వేస్తే పోలా.! అదే చెయ్యాలేమో. ఒమిక్రాన్ టెన్షన్స్ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్ని జనమే స్వచ్ఛందంగా బహిష్కరించి వుండాల్సింది. కానీ, అలా వుండలేరు కదా. వెళతారు, కోవిడ్ బారిన పడతారు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

తప్ప తాగి చిందులేయడం న్యూ ఇయర్ వేడుకల్లో సర్వసాధారణమైన విషయం. అక్కడ ఫేస్ మాస్కులు ధరించే పరిస్థితి వుండదు. భౌతిక దూరం అన్న మాటకే అర్థం వుండదు. సో, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడమేమోగానీ, ఒమిక్రాన్‌కి మాత్రం ఘనంగా స్వాగతం పలికేలానే వున్నారు.