Iran Earthquake: ఇరాన్ లో భూ ప్రకంపనలు.. అణు పరీక్షలే కారణమా..?

ఇజ్రాయెల్‌తో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో సంభవించిన తాజా భూకంపం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ఉత్తర ప్రాంతం సెమ్నాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

సెమ్నాన్‌ ప్రాంతంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం, క్షిపణుల ఉత్పత్తికి సంబంధించిన కీలక సైనిక కాంప్లెక్స్‌లు ఉన్నాయి. తాజాగా భూకంపం నమోదైన ప్రాంతం ఇవి ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే ఉండటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారికంగా దీనిపై ఎలాంటి వివరణ రాలేదప్పటికీ, అంతర్జాతీయ విశ్లేషకులు ఇది నిజంగానే సహజ భూకంపమా, లేక భూగర్భ అణు పరీక్షల ప్రతిఫలమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌లో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ దేశం అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్యలో ఉన్న ఆల్పైన్-హిమాలయన్ సెస్మిక్ బెల్ట్‌కు చెందుతోంది. ఈ కారణంగా భూకంపాల ముప్పు ఇక్కడ ఎక్కువ. 2006 నుంచి 2015 మధ్యకాలంలో ఇరాన్‌ మొత్తం మీద 96 వేలకుపైగా భూకంపాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి. సంవత్సరానికి సగటున 2 వేలకుపైగా ప్రకంపనలు నమోదవుతుండగా, 5 రిక్టర్ స్కేలు దాటి వచ్చే భూకంపాలు సుమారు 15 నుంచి 16 వరకూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజా భూకంపంలో ప్రాణనష్టం జరగలేదని, నష్టాలు స్వల్పంగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భూకంపం సంభవించిన ప్రాంతం అణు సామర్థ్యానికి సంబంధించిన ప్రాంతం కావడంతో ఇది సహజం కాదు, గోప్యంగా జరిపిన పరీక్షల వల్లే ఇదై ఉంటుందన్న అనుమానాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దీని మీద అంతర్జాతీయ నిఘా సంస్థలు, భూకంప పరిశోధనా కేంద్రాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌తో పెరిగిన సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఇదే తరహా ప్రకంపనలు మరింత ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని, శాంతి ప్రదేశాల్లో ఇలాంటి అనుమానాల ముసురు తొలగేందుకు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల సూచనలు.