రఘురామ మొబైల్ ఫోన్ పోయింది.. ఇదో కొత్త నాటకమా.?

Raghurama Sends Legal Notice To AP CID

Raghurama Sends Legal Notice To AP CID

వైసీపీ ఎంపీ (రెబల్) రఘురామకృష్ణరాజు మొబైల్ ఫోన్ ఆచూకీ కావాలట. కొద్ది రోజుల క్రితం.. అంటే, రఘురామని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన తర్వాత, ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ.? అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఆ ఫోన్ ద్వారానే రఘురామ అన్ని వ్యవహారాలూ చక్కబెట్టారనీ, అందులోని సమాచారాన్ని సేకరిస్తే, రఘురామ అక్రమాలు, ప్రభుత్వంపై పన్నిన కుట్రలూ వెలుగు చూస్తాయంటూ వార్తా కథనాలొచ్చాయి. అయితే, ఆ మొబైల్ ఫోన్ ఎక్కడుందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా, ఆ ఫోన్, ఏపీ సీఐడీ వద్దనే వుందన్నది రఘురామ తాజా ఆరోపణ.

ఈ మేరకు రఘురామ, ఏపీ సీఐడీ పోలీసులకు లీగల్ నోటీసు పంపారు. దాన్ని మెజిస్ట్రేట్ ముందుంచాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంతలోనే, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పీవీ రమేష్ ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణ చేశారు. రఘురామ ఫోన్ నెంబర్ ద్వారా తనకు బెదిరింపు మెసేజీలు వచ్చాయన్నది పీవీ రమేష్ ఆరోపణ. నేరుగా పీవీ రమేష్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళ వుంటే బావుండేదేమో. ఆ ప్రయత్నం ఆయన చేశారా.? లేదా.? అన్నదానిపై క్లారిటీ లేదు. కాగా, పీవీ రమేష్ ట్వీటుపై రఘురామ స్పందించారు.

ఏపీ సీఐడీ తన వద్ద నుంచి అనధికారికంగా ఆ ఫోన్ తీసుకున్నాక, తాను దాన్నుంచి ఎవరికీ మెసేజ్ పంపించడానికి వీల్లేకుండా పోయిందనీ, నిరభ్యంతరంగా బెదిరింపుల వ్యవహారంపై పిర్యాదు చేసుకోవచ్చనీ, తాను సైతం చట్టపరమైన చర్యలకు యోచిస్తున్నాననీ రఘురామ ట్వీటేశారు. నాలుగు రోజుల క్రితమే పాత సిమ్ కార్డుని బ్లాక్ చేసి, కొత్త సిమ్ కార్డు తీసుకున్నారట రఘురామ. ఇంతకీ, రఘురామ మొబైల్ ఫోన్ ఎక్కడుంది.? ఏపీ సీఐడీ తమ మీద వస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తుంది.? వేచి చూడాల్సిందే.