తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేషుగ్గా వున్నారు. గుండె సంబంధిత సమస్యలనీ, ఇంకోటనీ.. ఏవేవో సాకులు చూపిస్తూ, మెడికల్ గ్రౌండ్స్ కింద బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ తర్వాత ఎలాగైతేనేం రెగ్యులర్ బెయిల్ సంపాదించగలిగారు.
రెగ్యులర్ బెయిల్ రాగానే, చంద్రబాబు హుషారుగా కనిపించడం షురూ అయ్యింది. ఆయన ఢిల్లీలో వున్నారు ప్రస్తుతం. తనకు బెయిల్ రావడంలో బాగా కష్టపడ్డ సిద్దార్ధ లూద్రా ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొన్నారు చంద్రబాబు.. అది కూడా సతీ సమేతంగా.
బెయిల్ రాకపోయి వుంటే.? చంద్రబాబు అనారోగ్య సమస్యలు అలాగే వుండేవి. ఇక, చంద్రబాబుకి లభించిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ, సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, సీఐడీ కోరికల్ని మన్నించలేదు.
చంద్రబాబు, ఈ కేసుకు సంబంధించి ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయకూడదని మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు కూడా బెయిల్ షరతుల్లో ఈ విషయాన్నే ప్రస్తావించింది. మరోపక్క, వైసీపీ అనుకూల మీడియా మాత్రం, చంద్రబాబుకి సుప్రీం కొత్తగా బెయిల్ షరతులు విధించిందనీ, రాజకీయ సభల్లో పాల్గొనకూడదని ఆదేశించిందనీ.. తొందరపాటు వార్తా కథనాల్ని వండి వడ్డించింది.
ఈ అత్యుత్సాహమే వైసీపీ కొంపముంచుతోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించి, సొంత పైత్యాన్ని ప్రదర్శించడం.. తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి.