ఒక్కసారి బెయిల్ వచ్చాక, ఆ బెయిల్ రద్దయ్యే అవకాశాలెంత.? ఈ విషయమై న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుంటాయి. బెయిల్ అనేది ‘మెరిట్స్’ ప్రకారమే వస్తుంటుందన్నది అందరూ చెప్పేమాట. వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడం అన్నది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. హత్య కేసుల్లో బెయిల్ వస్తున్నప్పుడు, స్కామ్ కేసుల్లో బెయిల్ రావడం పెద్ద విషయమే కాదన్నది మరో వాదన.
అసలు విషయానికి వస్తే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకి ఇటీవల బెయిల్ లభించింది. అంతకు ముందు ఆయనకు మద్యంతర బెయిల్, మెడికల్ గ్రౌండ్స్ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చింది రెగ్యులర్ బెయిల్.
చంద్రబాబు పొందిన రెగ్యులర్ బెయిల్‌ని సవాల్ చేసింది ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో. హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని సీఐడీ తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానిస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం.
మళ్ళీ చంద్రబాబుని జైలుకు పంపాలన్నది ఏపీ సీఐడీ భావన. ఇదో చిత్రమైన సందర్భం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది రాజకీయ ప్రేరేపిత కేసు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చంద్రబాబు మీద ఇంకా ఇలాంటి కేసులు చాలానే వున్నాయి.
ఒకదాని తర్వాత ఇంకోటి.. వరుసగా అరెస్టులు జరిగే అవకాశం వుందని అధికార వైసీపీ చెబుతోంది. ఏపీ సీఐడీ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తోంది. ప్రభుత్వానికీ, పార్టీకీ, దర్యాప్తు సంస్థలకీ మధ్య చిన్న అడ్డు గీత ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, ఈ కేసులో ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
గతంలో సీబీఐని పంజరంలో చిలకలా సర్వోన్నత న్యాయస్థానమే అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక, ఏపీ సీఐడీ విషయంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తుందా.? అదే జరిగితే, అధికార వైసీపీ, సుప్రీంకోర్టుపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమో, చట్ట సభల్లో చర్చ పెట్టడమో చేస్తుందా.?
లేదూ, చంద్రబాబు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిస్తే, టీడీపీ ఎలా స్పందిస్తుంది.? వేచి చూడాల్సిందే.