New Districts : కొత్త జిల్లాల వ్యవహారమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రాజంపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనీ, పుట్టపర్తి జిల్లా కేంద్రంగా హిందూపురం వుండాలనీ.. ఇలా చాలా డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా వున్నాయి. అయితే, అవేవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలు కావాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేసేశారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే, కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవ్వాలని ముఖ్యమంత్రి అంటున్నారంటే, ఉగాదికి కనీసం ఒక్కరోజు ముందు అయినా తుది నోటిఫికేషన్ ఇవ్వనుండడం ఖాయంగానే కనిపిస్తోంది.
కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలియజేయాలంటూ గతంలోనే ప్రభుత్వం పేర్కొంది. చాలా అభ్యంతరాలు వచ్చాయి, ఆందోళనలు జరుగుతున్నాయి. వైసీపీ నేతల్లోనూ కొందరు కొత్త జిల్లాలపై అసహనంతో వున్నారు. అయినాగానీ, ఆయా అభ్యంతరాల్ని వైఎస్ జగన్ సర్కారు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కనిపించడంలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు వుండగా, వాటి సంఖ్య 26కి పెరగనుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుతో ఓ జిల్లా, అల్లూరి సీతారామరాజు పేరుతో ఇంకో జిల్లా.. ఇలా పేర్ల విషయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అయితే, ఎన్టీయార్ జిల్లా విషయమై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయంలోనూ, అభ్యంతరాల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలేదన్న విమర్శ వుంది.
ఏదిఏమైనా, కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో పరిపాలన మరింత సులభతరం అవుతుంది. అభివృద్ధి కూడా పుంజుకుంటుంది. సో, చిన్న చిన్న వివాదాలు, అభ్యంతరాల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో.!