కరోనా వైరస్ కొత్త మ్యూటెంట్ ఆంధ్రప్రదేశ్‌లో వుందా? లేదా?

New Covid 19 Mutant In AP

New Covid 19 Mutant In AP

కరోనా వైరస్ మొదటిసారిలా కాదు.. రెండో వేవ్ ఏకంగా సునామీలా విరుచుకుపడుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి కొంచెం బాగానే వుంది. అయినాగానీ, ఏపీలో ఇటీవలి కాలంలో అనూహ్యంగా కరోనా పాజిజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణం కొత్త మ్యూటెంట్.. అనే ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వాదనల్ని తోసిపుచ్చుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న మాట వాస్తవమేననీ, మరణాల సంఖ్య కూడా పెరుగుతోందనీ, అయితే ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా వుందనీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయినాగానీ, నేషనల్ మీడియా సైతం, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కొత్త మ్యూటెంట్ వెలుగు చూసిందని చెబుతూ, దానికి ఏపీ స్ట్రెయిన్ అనే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. నిజానికి, శాస్త్రీయంగా ఇలాంటి విషయాలు ప్రూవ్ అయ్యాకనే, మీడియా ఈ అంశాల్ని ప్రజల ముందుంచితే బావుంటుంది. ఎందుకంటే, కరోనా నేపథ్యంలో చాలా భయాలు ఇప్పటికే ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్నాయి. కరోనా తీవ్రత కంటే, ఆ కరోనా వైరస్ చుట్టూ జరుగుతున్న ప్రచారాల తీవ్రత కారణంగా మానసిక ఆందోళనతో ఎక్కువమంది చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిందని తెలియగానే గుండె పోటుతో మరణించిన వ్యక్తి.. అంటూ ఈ మధ్య తరచూ వార్తలు వింటున్నాం. నిజానికి, ఏ వైరస్ అయినా.. పరివర్తనం చెందటం అనేది సర్వసాధారణం. డబుల్ మ్యుటెంట్లు, ట్రిపుల్ మ్యుటెంట్లు.. ఆ పైన కూడా వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మ్యుటెంట్ల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుంది తప్ప, వ్యాధి తీవ్రత, అవి కలిగించే మరణాల శాతం ఎక్కువేమీ లేదన్న అభిప్రాయాలూ వైద్య నిపుణులనుంచి వ్యక్తమవుతున్నాయి.