కళ్ళ ముందు జరిగే నేరాలను, పలానా చోట జరుగుతుందనే సమాచారం ఉన్న మోసాన్ని ఏదో ఒకటిచేసి ఆపవచ్చు. కానీ సైబర్ నేతలను మాత్రం ఆపలేరు. ప్రపంచంలో నడుస్తున్న అనేక నేర సామ్రాజ్యాలకు ఇంటర్నెట్ ఓ వేదికగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్ధిక నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. పలానా దేశం అని లేకుండా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టాలని పెద్ద పెద్ద దేశాలన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడంలేదు. రోజూ కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం మీద సైబర్ మోసగాళ్ల కన్ను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
బ్యాంకులన్నీ పటిష్టమైన సర్వర్ వ్యవస్థ, ఫైర్ వాల్స్ కలిగి ఉండటంతో బ్యాంకుల మీద సైబర్ దాడులు తగ్గాయి కానీ కస్టమర్ల వైపు నుండి మాత్రం సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జరిగే ఆర్ధిక నేరాలన్నీ కస్టమర్లలోని బలహీనతల్ని బేస్ చేసుకునే జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ప్రైజ్ మనీలు, సప్రైజ్ గిఫ్టులు అంటూ కస్టమర్ల ఖాతాల నుండి, క్రెడిట్ కార్డుల నుండి డబ్బును దొచేసిన మోసగాళ్లు ఇప్పుడు బ్యాంకుల నుండి చేస్తున్నట్టు ఫోన్లు చేసి చాకచక్యంగా కార్డుల వివరాలు కనుకున్ని అందులోని డబ్బును గుంజేసిన మోసగాళ్లు ఇప్పుడు ఇంకో కొత్త ఎత్తును కనుగొన్నారు.
ఈకెవైసీ అంటూ కష్టమర్లను నిలువునా ముంచేస్తున్నారు. ఇందులో ఫోన్లు చేయడం, మాటల్లోకి దింపడం లాంటి వ్యవహారాలేమీ ఉండవు. కేవలం ఒక మెసేజ్, ఆపైన ఒక వెబ్ లింక్. ఈకెవైసీ అంటూ బ్యాంకుల పేరిట వచ్చే సందేశాల్లోని లింక్ ను ఓపెన్ చేసి డీటైల్స్ ఇచ్చారంటే క్షణాల్లో మీ అకౌంట్లోని డబ్బు మాయయమై పోతుంది. తాజాగా విశాఖలోని ఒక కస్టమర్ ఇలాగే మోసపోయాడు. ఈకెవైసీ అంటూ వచ్చిన వెబ్ లింక్ ఓపెన్ చేసి వివరాలు ఇచ్చిన సదరు వ్యక్తి కాసేపటికే ఖాతాలో ఉన్న 50 వేల రూపాయలు మాయమైనట్టు గుర్తించి లబోదిబోమని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనుక కేటుగాళ్లు కనిపెట్టిన ఈ కొత్త కెవైసీ మోసం నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.