ఏపీ సీఎం వైఎస్ జగన్ చాలా సందర్భాల్లో ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పనని మడమ తిప్పనని చెబుతారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని విషయాలకు సంబంధించి జగన్ మాట తప్పారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ మన హయాంలో కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తామని 9 ఫిషింగ్ హార్బర్లు సైతం వేగవంతంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయని తాజాగా చెప్పుకొచ్చారు.
ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా లక్ష మంది మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగాలు రావడం ఖాయమని జగన్ కామెంట్లు చేశారు. రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా జగన్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యమని మత్స్యకార నిపుణులు, అధికారులు వెల్లడిస్తున్నారు. మత్స్య అభివృద్ధి అధికారి, ఇతర క్షేత్రస్థాయి పోస్టులు మాత్రమే ఫిషింగ్ హార్బర్లలో ఉంటాయి.
ఈ ఉద్యోగాలు కూడా పదుల సంఖ్యలో ఉంటాయే తప్ప వందలు, వేల సంఖ్యలో మాత్రం ఉండవు. ఈ హార్బర్ల వల్ల మత్స్యకారులకు ఉపాధి మెరుగవుతుందని అంతకు మించి మరెవరికీ పెద్దగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే హార్బర్లకు అనుబంధంగా ప్రైవేట్ రంగానికి చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
కూలి పనుల వంటి ఉపాధి అవకాశాలు మినహా మంచి వేతనాలు ఇచ్చే ఉపాధి అవకాశాలు హార్బర్లలో లభించడం సులువు కాదని తెలుస్తోంది. సీఎం జగన్ మాయమాటలు చెబుతున్నారని ఇతర పార్టీల నేతలు, మత్స్యకార నిపుణులు చెబుతున్నారు. పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం జగన్ చెప్పినా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో 9 ఫిషింగ్ హార్బర్లలో, పోర్టులలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో చూడాల్సి ఉంది.