నెల్లూరు వైసీపీ నాయకుడి కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్నాళ్ళ క్రితం వరకూ వైసీపీలో అన్నీ తానే అయి వ్యవహరించారాయన. కానీ, ఎప్పుడైతే ‘కీలక పదవి’ పోయిందో, ఆ తర్వాతి నుంచి ఆయన్ని పట్టించుకోవడమే మానేశారు స్థానిక వైసీపీ నేతలు. ‘కీలక పదవి’ ఎప్పుడైతే ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో, అప్పటినుంచీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారట ఆ ఒకప్పటి కీలక నేత.

వేరే పార్టీల్లోకి వెళ్ళలేరు, సొంత పార్టీలో గౌరవం దక్కడంలేదు. ఆఖరికి బంధువులనుకున్నవారు కూడా ఆ నాయకుడికి దూరమవుతుండడమే కాదు, ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు. పదవి పోయాక, చేసిన బల ప్రదర్శన తప్పితే, తన ఉనికిని చాటుకోవడానికి ఇంకో వేదికను ఆయన ఏర్పాటు చేసుకోలేకపోయారు పార్టీ పరంగా.

గతంలో అనేక ఆరోపణలు ఆయన మీద వచ్చాయి.. అదీ ఆయనగారి ఆర్జనకు సంబంధించి. ఇప్పుడేమో వాటి ద్వారా కూడా సంపాదన తగ్గిపోయిందని అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ముఖ్యమంత్రి దగ్గర మొరపెట్టుకుందామనుకుంటే, వైఎస్ జగన్ అందుకు అవకాశమే ఇవ్వడంలేదట. దానిక్కారణం, పదవి పోగానే ఆధిపత్య పోరులో తగ్గేది లేదని సదరు కీలక నేత వ్యాఖ్యానించడమేనని తెలుస్తోంది.

‘పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను.? ఆ కష్టానికి గౌరవంగా పదవి దక్కిందనుకుంటే.. పదవి పోయాక, మరీ హీనంగా చూస్తున్నారు..’ అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పైగా, ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సానుభూతిపరుడాయె.. కానీ, వైసీపీ నేతగా పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలేశారన్న విమర్శ వుంది. జనసేనలోకి ఆయనకు ఎంట్రీ లేదు. టీడీపీ రానివ్వదు.

మధ్యేమార్గంగా బీజేపీ వైపు చూద్దామనుకున్నా.. అక్కడా ఆయనకి పరిస్థితులు అంతగా అనుకూలించడంలేదట. సామాజిక వర్గ ప్రముఖులతో చర్చోపచర్చలు జరుపుతూ, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఆయనగారు పడరాని పాట్లూ పడుతున్నారట.